ఐదేళ్ల తర్వాత టెస్టు క్రికెట్ ఆడే దేశాలు తగ్గిపోతాయి... ఇండియాతో పాటు ఆ నాలుగు...

First Published Sep 7, 2021, 4:46 PM IST

టీ20, వన్డే ఫార్మాట్లు వచ్చిన తర్వాత టెస్టు క్రికెట్‌కి ఆదరణ తగ్గిపోయింది. టీ20ల్లో స్పీడ్ క్రికెట్‌కి అలవాటు పడిన జనాలకు, టెస్టు క్రికెట్‌లోని క్లాస్ అర్థం కావడం లేదు. దీంతో మరో ఐదేళ్ల తర్వాత మహా అయితే ఐదు దేశాలే టెస్టు క్రికెట్ ఆడతాయని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...

టెస్టు క్రికెట్‌కి ఆదరణ పెంచేందుకు ఐసీసీ ప్రతిష్టాత్మకంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను తీసుకొచ్చింది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయినా, ఫైనల్ కోసం పోటీ కేవలం నాలుగు దేశాల మధ్యే ఉండింది...

భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు టాప్ 2 ప్లేస్‌ కోసం తీవ్రంగా పోటీపడగా... సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఈ ఫైనల్ 4కి చాలా దూరంలో నిలిచిపోయాయి...

ఐపీఎల్ తర్వాత పాక్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్... ఇలా అరడజనుకు పైగా టీ20 లీగ్‌లు ఎంట్రీ ఇవ్వడంతో టెస్టులకు ఆదరణ మరింత తగ్గుతూ పోయింది...

టీ20 వరల్డ్‌కప్ 2021 సమీపిస్తున్న సమయంలో మిగిలిన దేశాలు టీ20 సిరీస్‌లు, వన్డే సిరీస్‌లతో బిజీగా గడుపుతున్నాయి... ఐసీసీ డబ్ల్యూటీసీ 2021 సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా ఇప్పటిదాకా జరిగిన టెస్టు సిరీస్‌లు రెండే రెండు...

వెస్టిండీస్, పాకిస్తాన్ మధ్య రెండు టెస్టు మ్యాచులు జరిగి... చెరో మ్యచ్ గెలిస్తే... ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ముగింపు దశకు చేరుకుంది.

‘ఈ ట్వీట్ చేయడం చాలా బాధని కలిగిస్తోంది.  కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే... నెమ్మదిగా టెస్టు క్రికెట్ ఆడే దేశాల సంఖ్య తగ్గిపోతుందని అనిపిస్తుంది. 2026 నాటికి మహా అయితే ఐదు టెస్టు క్రికెట్ దేశాలు ఉంటాయి...

అవి ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా... ఇంకా పాకిస్తాన్, సౌతాఫ్రికా దేశాలు టెస్టు క్రికెట్‌లో కొనసాగుతూ ఉండొచ్చు...’ అంటూ ట్వీట్ చేశాడు కేవిన్ పీటర్సన్...

అయితే మొట్టమొదటి ఐసీసీ డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ పేరు లిస్టులో లేకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది... 

న్యూజిలాండ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచినా, వారి విజయాల్లో ఎక్కువ శాతం స్వదేశంలో వచ్చినవే. విదేశీ పిచ్‌లపై, ముఖ్యంగా ఉపఖండ పిచ్‌లపై విజయాలు అందుకోగలమని న్యూజిలాండ్ ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది...

కేవిన్ పీటర్సన్ ట్వీట్‌పై కొందరు అభ్యంతరాలు చెబుతున్నా, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది నిజమేనని అనిపించక మానదు... ఒకప్పుడు టెస్టు క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్, ఇప్పుడు టీ20లకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది...

బంగ్లాదేశ్, శ్రీలంక, సౌతాఫ్రికాల పరిస్థితి దారుణంగా తయారైంది. బంగ్లా టీ20ల్లో విజయాలు అందుకుంటున్నా, టెస్టుల్లో నిలకడైన ప్రదర్శన ఇవ్వడం లేదు...

మిగిలిన టెస్టులతో పోలిస్తే, ఇండియా ఆడే టెస్టు మ్యాచులకు విశేష ఆదరణ లభిస్తోంది... అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది...

ఆ విధంగా చూసుకున్నా, కేవిన్ పీటర్సన్ లిస్టులో దేశాల పేర్లు మారొచ్చేమో కానీ, భవిష్యత్తులో ఐదు రోజుల పాటు నిలబడి ఓపిగ్గా టెస్టు క్రికెట్ ఆడే జట్ల సంఖ్య మాత్రం తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు...

click me!