రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న పాక్ పేసర్ మహ్మద్ అమీర్... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో...

First Published Sep 7, 2021, 3:05 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి జట్టుని ప్రకటించిన వెంటనే హెడ్‌కోచ్, బౌలింగ్ కోచ్ పదవులకు మిస్బావుల్ హక్, వకార్ యూనిస్ రాజీనామాలు చేయడంతో అవాక్కైన పాక్ టీమ్‌కి ఇది నిజంగా శుభవార్తే. కొన్నాళ్ల కిందట పీసీబీతో గొడవ పడి, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన పాక్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్, తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు...

పాక్ క్రికెట్ జట్టులో స్టార్ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ అమీర్, 50 టీ20 మ్యాచుల్లో 74 వికెట్లు పడగొట్టాడు. 36 టెస్టుల్లో 144 వికెట్లు తీసి, స్టార్‌గా ఎదిగాడు...

అయితే టెస్టు రిటైర్మెంట్ గురించి పాక్ క్రికెట్ బోర్డుతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా డిసెంబర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందరికీ షాక్ ఇచ్చాడు అమీర్...

పాక్ క్రికెట్ బోర్డు నుంచి తాను విపరీతమైన మెంటల్ టార్చర్ భరించానని, ఇంకా భరించే ఓపిక లేదంటూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మహ్మద్ అమీర్...

తాజాగా తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన మహ్మద్ అమీర్, తాను సెలక్షన్‌కి సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌ 2021కి ముందు పాక్ ముందు మరో మంచి పేసర్ అదనంగా దొరికాడు...

ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్టును ప్రకటించింది పాకిస్తాన్. అయితే కరోనా నిబంధనల కారణంగా అవసరమైతే యూఏఈలో వారం రోజుల పాటు గడిపే ఐసోలేషన్ పూర్తయ్యేలోపు జట్టులో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించింది ఐసీసీ...

2009 టీ20 వరల్డ్‌కప్‌లో ఆరంగ్రేటం చేసిన మహ్మద్ అమీర్, ఈ టోర్నీలో తాను వేసిన రెండో బంతికే వికెట్ తీశాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో దిల్సాన్ వికెట్ తీసిన అమీర్, మెయిడిన్ ఓవర్ వేసి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు...

పాక్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌తో మహ్మద్ అమీర్‌కి కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయని తెలిసింది... వకార్ యూనిస్, తన బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేయడంతో మహ్మద్ అమీర్ కమ్‌బ్యాక్ ఇస్తున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది.

పాక్ బౌలింగ్ కోచ్‌తో పాటు హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్‌తో కూడా తనకు విబేధాలు ఉన్నాయని, ఇద్దరూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు మహ్మద్ అమీర్... ఈ ఇద్దరూ తమ పదవుల నుంచి తప్పుకోగానే అమీర్ కమ్‌బ్యాక్ ఇస్తున్నట్టు ప్రకటించాడు.

2010 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసిన మహ్మద్ అమీర్, మరో రెండు రనౌట్లతో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు....

2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలను అవుట్ చేసి, పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన అమీర్, కమ్‌‌బ్యాక్ పాకిస్తాన్‌కి మంచి ఎనర్జీని ఇచ్చే విషయమే..

click me!