యాషెస్ సిరీస్‌కి జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్... బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌లకు దక్కని చోటు...

First Published Oct 10, 2021, 5:24 PM IST

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. నవంబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించే ఈ జట్టులో 10 మందికి ఇదే మొట్టమొదటి ఆసీస్ టూర్ కానుంది...

ఇంగ్లాండ్ క్రికెట్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌ ఎంపిక చేసిన జట్టులో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్‌లకు చోటు దక్కలేదు..

ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు మెంటల్ హెల్త్ కోసం క్రికెట్ నుంచి నిరవధిక బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు బెన్ స్టోక్స్. అతని రీఎంట్రీ ఎప్పుడనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు...

అలాగే కొన్ని నెలలుగా గాయంతో బాధపడుతున్న జోఫ్రా ఆర్చర్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైద్యులు నిర్ధారణ చేయడంతో అతను కూడా యాషెస్ సిరీస్‌కి దూరమయ్యాడు... 

కరోనా ప్రోటోకాల్, క్వారంటైన్ నిబంధనలకు, కుటుంబాలను అనుమతించకపోవడం వంటి నియమాలతో ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఆసీస్ బోర్డు మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో క్వారంటైన్ నిబంధనలను సరళీకృతం చేసేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది...

నవంబర్ 4న ఆస్ట్రేలియా చేరుకునే ఇంగ్లాండ్ జట్టు, డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లో మొదటి టెస్టు, 16న ఆడిలైడ్‌లో రెండో టెస్టు, 26న మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు ఆడుతుంది. 2022 జనవరి 5న సిడ్నీలో నాలుగో టెస్టు, పెర్త్‌లో జనవరి 14 నుంచి ఆఖరి టెస్టు ఆడుతుంది...

యాషెస్ సిరీస్ 2021-22 ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, డామ్ బెస్, రోరీ బర్న్స్, స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, జాక్ క్రావ్లీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెగ్ ఓవర్టన్, ఓల్లీ పోప్, ఓల్లీ రాబిన్‌సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

యాషెస్ సిరీస్‌కి 140 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1882లో ది ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియా చేతుల్లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఇంగ్లాండ్‌లో ఆసీస్‌కి ఇదే మొట్టమొదటి విజయం. 

దీంతో ఓ ఇంగ్లీష్ వార్తాపత్రిక, ఇంగ్లాండ్ క్రికెట్ చనిపోయిందనే ఉద్దేశంతో ‘బాడీని కాల్చివేసి, బూడిద (యాషెస్)ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తారు’ అంటూ రాసుకొచ్చింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్‌కి ‘ది యాషెస్’ అనే పేరు వచ్చింది. 

click me!