Siraj: సెంచరీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై సిరాజ్ మియా విధ్వంసం
IPL SRH vs GT: ఐపీఎల్ 2025లో మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ను వారి సొంత గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఓడించింది.
IPL SRH vs GT: ఐపీఎల్ 2025లో మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ను వారి సొంత గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఓడించింది.
IPL SRH vs GT: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు వినబడితే చాలు ఆందరికీ గుర్తుకు వచ్చేది ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సునామీ ఇన్నింగ్స్ లు.. భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టించిన మ్యాచ్ లు. ఎందుకంటే హైదరాబాద్ టీమ్ లో అలాంటి బిగ్ హిట్టర్లు, స్టార్ బ్యాటర్లు ఉన్నారు.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ప్లేర్లు వింటే చాలు ప్రత్యర్థి జట్లకు దడలే. తన హోం గ్రౌండ్ ఉప్పల్ లో మ్యాచ్ అయితే పరుగుల వరద పారుతుంది. కానీ, అలాంటిదేమీ కనిపించకుండా చేశాడు హైదరాబాద్ లోకల్ బాయ్, గుజరాత్ తరఫున ఆడుతున్న మహ్మద్ సిరాజ్. తన అద్భుతమైన బౌలింగ్ తో హైదరాబాద్ ప్లేయర్లకు చెమటలు పట్టించారు. సన్ రైజర్స్ బిగ్ హిట్టర్లు సైతం తన టెర్రిఫిక్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయారు. అతని దెబ్బతో హైదరాబాద్ టీమ్ సాధారణ స్కోర్ కూడా చేయలేకపోయింది. వరుసగా నాల్గో ఓటమిని చవిచూసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో 19వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ - గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతూ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ హైదరాబ్ టీమ్ ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 152/8 పరుగులు చేసింది. గుజరాత్ టీమ్ 16.4 ఓవర్లలో 153/3 పరుగులతో టార్గెట్ ను అందుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ మైదరాబాద్ మొదట బ్యాటింగ్ కు దిగింది. హోం గ్రౌండ్ లో ఆడుతున్న మ్యాచ్ కావడంతో బిగ్ హిట్టర్లు ఉండటంతో వారి నుంచి సునామీ ఇన్నింగ్స్ లతో భారీ స్కోర్ వస్తుందని అందరూ భావించారు. కానీ, అలాంటిదేమీ కనిపించలేదు. సన్ రైజర్స్ బ్యాటర్ల పరుగుల సునామీ రాలేదు. కానీ, హైదరాబాద్ ప్లేయర్, గుజరాత్ తరఫున ఆడుతున్న మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ ను దెబ్బకొట్టాడు.
తన సొంత మైదానంలో పవర్‌ప్లేలో ప్రమాదకరంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చాడు. తన జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు ఐపీఎల్ లో 100 వికెట్లను పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సిరాజ్ గుజరాత్ కు పెద్ద విజయాన్ని అందించాడు. గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ బౌలర్ ఇక్కడ కూడా ఇలాంటి ప్రదర్శనే ఇచ్చాడు. తొలి ఓవర్ చివరి బంతికి డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేశాడు. 5 బంతుల్లో 8 పరుగులు చేసిన హెడ్ సిరాజ్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.
ఆ తర్వాత తన బౌలింగ్ జోరును కొనసాగించిన సిరాజ్ మియా అభిషేక్ శర్మ రూపంలో గుజరాత్‌కు మరో బిగ్ వికెట్ అందించారు. 16 బంతుల్లో 18 పరుగులు చేసిన అభిషేక్ పెవిలియన్ కు చేరాడు. ఐపీఎల్‌లో సిరాజ్‌కు 100వ వికెట్ ఇది. తన నాలుగో ఓవర్లో అనికేత్ వర్మను సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి సిమర్జీత్ సింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి హైదరాబాద్ టీమ్ ను కోలుకోని దెబ్బకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో వికెట్ల పరంగా సెంచరీ చేసిన 26వ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. అతను 97 మ్యాచ్‌ల్లో 102 వికెట్లు పడగొట్టాడు.
సిరాజ్ 100 ఐపీఎల్ వికెట్లలో 42 పవర్ ప్లే సమయంలోనే రావడం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతను 4 మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీతో జరిగిన చివరి మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఐపీఎల్‌లో సిరాజ్ ప్రయాణం
సిరాజ్ తన ఐపీఎల్ కెరీర్‌ను 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ప్రారంభించాడు. అతని బేస్ ధర రూ.20 లక్షల నుండి రూ.2.6 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఆరెంజ్ ఆర్మీ తరపున ఆరు మ్యాచ్‌లు ఆడి 21.20 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. 2018లోRCB సిరాజ్ ను రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ జట్టు తరఫున 87 మ్యాచ్‌ల్లో 83 వికెట్లు పడగొట్టాడు. గత సంవత్సరం చివరిలో అతన్ని RCB వదులుకుంది. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ అతన్ని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. తనపై గుజరాత్ ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా అద్భుతమైన బౌలింగ్ తో సిరాజ్ అదరగొడుతున్నాడు.