దినేశ్ కార్తీక్‌లో కనిపించని ఫైర్... రిషబ్ పంత్‌కి రూట్ క్లియర్ చేసేసినట్టేనా...

First Published | Oct 31, 2022, 10:11 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు దినేశ్ కార్తీక్. 37 ఏళ్ల వయసులో టీమిండియాలో కమ్‌బ్యాక్‌ ఇచ్చిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2022 సీజన్‌తో పాటు ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లోనూ ఆఖర్లో వచ్చి మెరుపులు మెరిపించి సెలక్టర్లను మెప్పించాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడిన దినేశ్ కార్తీక్‌ని టీ20 వరల్డ్ కప్‌ని సెలక్ట్ చేశారు సెలక్టర్లు...
 

Dinesh Karthik

యంగ్ వికెట్ కీపర్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌ వంటి వారిని పక్కనబెట్టి సీనియర్ మోస్ట్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో చోటు కల్పించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. గౌతమ్ గంభీర్ లాంటి మాజీ క్రికెటర్లు అయితే ఈ వయసులో దినేశ్ కార్తీక్‌ని వరల్డ్ కప్ ఆడించడం వేస్ట్ అన్నారు...

Image credit: PTI

అయితే దినేశ్ కార్తీక్‌పై బోలెడంత నమ్మకం పెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్, మొదటి మూడు మ్యాచుల్లో అతనికే తుదిజట్టులో చోటు కల్పించింది. దీంతో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది...


Dinesh Karthik

అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన మొదటి మూడు మ్యాచుల్లో దినేశ్ కార్తీక్ పర్ఫామెన్స్ పెద్దగా మెప్పించలేకపోయింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి 5 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చాడు దినేశ్ కార్తీక్...

మొదటి బంతికి సింగిల్ తీసి విరాట్ కోహ్లీకి స్ట్రైయికింగ్ ఇచ్చిన దినేశ్ కార్తీక్... భారత జట్టు విజయానికి ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన సమయంలో భారీ షాట్ ఆడేందుకు క్రీజు దాటి ముందుకొచ్చి స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ సమయోచితంగా ఆలోచించి ఆడడం వల్ల టీమిండియా గెలవగలిగింది. లేదంటే దినేశ్ కార్తీక్ తొందరపాటు కారణంగా పాక్ చేతుల్లో మరో పరాభవం ఎదురై ఉండేది...

Image credit: PTI

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ సక్సెస్ కావడం వల్ల (కెఎల్ రాహుల్ తప్ప) దినేశ్ కార్తీక్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ దినేశ్ కార్తీక్ మెప్పించలేకపోయాడు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా వెంటవెంటనే అవుట్ కావడంతో 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 

ఈ దశలో సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు దినేశ్ కార్తీక్. అయితే ఈ భాగస్వామ్యంలో దినేశ్ కార్తీక్ చేసింది 6 పరుగులే. 15 బంతులాడి 6 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, పార్నెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

Image credit: Getty

దినేశ్ కార్తీక్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఫినిషర్ రోల్ ఆశిస్తోంది టీమిండియా. అయితే ఇప్పటిదాకా కార్తీక్ నుంచి అలాంటి ఇన్నింగ్స్ రాలేదు. అదీకాకుండా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో దినేశ్ కార్తీక్‌కి ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు...

2019 వన్డే వరల్డ్ కప్‌లో 8, 6 పరుగులు చేసి అవుటైన దినేశ్ కార్తీక్, 2007 నుంచి ఇప్పటిదాకా టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన 7 ఇన్నింగ్స్‌ల్లో 11, 17, 0, 16, 13, 1, 6 పరుగులు చేశాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా 25+ స్కోరు కూడా నమోదుచేయలేకపోయాడు. 

Image credit: PTI

అదీకాకుండా దినేశ్ కార్తీక్ నడుమునొప్పితో బాధపడుతున్నాడని సౌతాఫ్రికాతో మ్యాచ్ అనంతరం కామెంట్ చేశాడు టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్. దీంతో ఇకపై జరిగే మ్యాచుల్లో దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ ఆడడం దాదాపు ఖాయమైపోయినట్టే కనిపిస్తోంది...

Latest Videos

click me!