టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో వెయ్యి పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్ గా కోహ్లీ రికార్డులకెక్కాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ.. 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేశాడు. ఈ సందర్బంగా కోహ్లీ.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో వెయ్యి పరుగులు సాధించిన రెండో క్రికెటర్ గా, తొలి భారత క్రికెటర్ గా ఘనత సాధించాడు. కోహ్లీ తర్వాత భారత్ నుంచి టీమిండియా సారథి రోహిత్ శర్మ (36 మ్యాచ్ లలో 919 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దెనే.. టీ20 ప్రపంచకప్ లో 31 మ్యాచ్ లలో 31 ఇన్నింగ్స్) 1,016 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ.. 23 మ్యాచ్ లలో 989 పరుగులు సాధించాడు. కానీ ఈ మ్యాచ్ లో కోహ్లీ.. 12 పరుగులు చేసి వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ.. 24 మ్యాచ్ లు (22 ఇన్నింగ్స్ లలో) ఆడి 1001 పరుగులు సాధించాడు. వాస్తవానికి దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కంటే ముందు మరో 28 పరుగులు చేస్తే కోహ్లీ.. జయవర్దెనే రికార్డును అధిగమించేవాడు. కానీ కోహ్లీ అందుకు మరో 16 పరుగుల దూరంలో ఆగిపోయాడు.
జయవర్దెనే రికార్డును బద్దలుకొట్టకున్నా.. కోహ్లీ మాత్రం టీ20 లలో ఐసీసీ నిర్వహించే పొట్టి ప్రపంచకప్ లో వెయ్యి పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్ గా నిలవడం గమనార్హం. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలలో కోహ్లీ సగటు 89.90 గా ఉండగా, జయవర్దెనే సగటు 39.07గానే ఉంది. 31 ఇన్నింగ్స్ లలో కోహ్లీ.. 12 హాఫ్ సెంచరీలు చేశాడు. జయవర్దెనే 6 హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ చేశాడు. కోహ్లీ సెంచరీ చేయకున్నా అత్యధిక స్కోరు 87 గా ఉంది.
ఇక ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్ లో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. సఫారీ బౌలింగ్ ధాటికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (68) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు.