వచ్చే సీజన్ లో అతడిని పక్కనబెడితే సీఎస్కే కు రూ. 16 కోట్లు మిగులుతాయి.. కానీ.. : జడ్డూపై చోప్రా కామెంట్స్

First Published May 25, 2022, 12:21 PM IST

IPL 2022: ఐపీఎల్-15 లో చెన్నై సూపర్ కింగ్స్ కు 8 మ్యాచులలో సారథ్యం వహించిన రవీంద్ర జడేజా.. సీజన్ లో ఆఖరి మ్యాచులకు దూరమయ్యాడు. సోషల్ మీడియాలో ఆ జట్టు అధికారిక ఖాతాలను కూడా అన్ ఫాలో చేశాడు. 

ఈ సీజన్ కు రెండ్రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా నియమితుడైన రవీంద్ర జడేజా తర్వాత  8 మ్యాచులకే చేతులెత్తేశాడు. కెప్టెన్సీ ఒత్తిడిని భరించలేక వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. 

2022 సీజన్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా కెప్టెన్ ధోని కంటే  రవీంద్ర జడేజా కే ఎక్కువ (రూ. 16 కోట్లు) ఖర్చు చేసిన సీఎస్కే.. అతడిపై నమ్మకముంచినా జడ్డూ దానిని  నిలబెట్టుకోలేకపోయాడు. 8 మ్యాచులకే సారథిగా ఉండి తర్వాత  సారథ్య పగ్గాలను ధోనికే అప్పగించేశాడు. 

Latest Videos


అయితే  కెప్టెన్సీ కోల్పోయాక అతడు రెండు మ్యాచులు మాత్రమే ఆడి తర్వాత నాలుగు మ్యాచులకు అందుబాటులో లేడు. గాయం కారణంగా అతడు సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. అదీగాక సోషల్ మీడియాలో చెన్నై అధికారిక ఖాతాలను కూడా ఫాలో అవడం ఆపేశాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే-జడేజాకు మధ్య విబేధాలు తలెత్తాయని మీడియా కోడై కూస్తున్నది. 

ఇదే విషయమ్మీద తాజాగా  టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు.  ఆకాశ్ మాట్లాడుతూ.. ‘జడేజా విషయంలో చాలా ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోయాయి. ఆఖరి నాలుగు మ్యాచులకు అతడు ఎందుకు దూరంగా ఉన్నాడు..? గాయమైందని కారణం చెప్పినా అది నమ్మశక్యంగా  లేదు.

అంతకుముందు 8 మ్యాచులకు కెప్టెన్ గా ఉండి తర్వాత తప్పుకున్నాడు. దీనికి కూడా సరైన కారణం చూపలేదు. చెన్నై అతడిని ఈ సీజన్ లో రూ. 16 కోట్లకు  రిటైన్ చేసుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే అతడు వచ్చే ఏడాది మళ్లీ సీఎస్కే పగ్గాలు చేపట్టడని స్పష్టంగా తెలుస్తున్నది.

ధోని సైతం కెప్టెన్సీ ప్రభావం వల్లే జడ్డూ తన లయ కోల్పోయాడని చెప్పాడు. తమ జట్టులో అంతా బాగానే ఉందని సీఎస్కే  పైకి చెబుతున్నా  కానీ లోపల ఏదో జరుగుతుందని అందరికీ అనుమానంగానే ఉంది. ఆ జట్టులో జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం. 
 

ఇక వచ్చే ఏడాది సీఎస్కే.. జడ్డూను రిలీవ్ చేస్తే ఆ జట్టుకు రూ. 16 కోట్లు మిగులుతాయి.  కానీ  అలాంటి ఆటగాడు మాత్రం సీఎస్కేకు ఎప్పటికీ దొరకడు.’ అని అన్నాడు. 
 

ఈ సీజన్ లో 10 మ్యాచులాడిన జడ్డూ..  బ్యాటింగ్ లో 19.33 సగటుతో 116 పరుగులు చేశాడు. బౌలింగ్ లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 8 మ్యాచుల తర్వాత  కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 

click me!