CSKvsMI: ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ వర్సెస్ ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ... ఎవరి బలమెంత?

First Published | Apr 30, 2021, 10:29 PM IST

IPL 2021 సీజన్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లు అయిన రోహిత్ శర్మ వర్సెస్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య హోరీహోరీ ఫైట్ ఉంటుందని ఆశిస్తున్నారు క్రికెట్ అభిమానులు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నైలో ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు మ్యాచులు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్, వేదిక మారిన తర్వాత ఆటలో కూడా మార్పు తీసుకొచ్చింది. ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి విజయాన్ని అందుకుంది ముంబై.
మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్‌లో అద్భుతమైన విజయాలతో టాప్‌లో దూసుకుపోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఢిల్లీ చేతిలో మొదటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత వరుసగా ఐదు విజయాలు అందుకుంది సీఎస్‌కే...

సీఎస్‌కే జైత్రయాత్రకు బ్రేక్ వేయగల టీమ్ ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్ మాత్రమే. పిచ్ మారిన తర్వాత ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్‌కి ఈ మ్యాచ్ విజయం కూడా కీలకం కానుంది. దాంతో హిట్ మ్యాన్ వర్సెస్ ‘కూల్ కెప్టెన్’ మధ్య మంచి ఆసక్తికర ఫైట్ ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అంచనా...
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు. వీరితో పాటు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నారు. వీరితో పాటు లోయర్ ఆర్డర్‌లో సామ్ కుర్రాన్ కూడా మెరుపులు మెరిపించగలడు...
మరోవైపు ముంబై ఇండియన్స్‌, ఐపీఎల్ 2021 సీజన్‌లో బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతోంది. ఓపెనర్ డి కాక్ గత మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చినా ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా ఇప్పటిదాకా పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన పేసర్ దీపక్ చాహార్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచుల్లో నాలుగేసి వికెట్లు తీసిన దీపక్ చాహార్‌తో పాటు మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, లుంగి ఇంగిడి అద్భుతంగా రాణిస్తున్నారు.
బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అవుతున్నా ముంబై బౌలర్లు మాత్రం అదరగొడుతున్నారు. బుమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహార్ అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఏకంగా 30 మ్యాచులు జరిగాయి. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులతో కలిపి 18 మ్యాచుల్లో ముంబై విజయం సాధించగా 12 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది.
అయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రెండు జట్ల మధ్య 18 మ్యాచులు జరిగాయి. వీటిలో 10 మ్యాచుల్లో రోహిత్ టీమ్ విజయం సాధించగా, 8 మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది...
గత సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో లీగ్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది ముంబై ఇండియన్స్...
ఐపీఎల్ సీజన్ ఆరంభంలో ఓ మాదిరి పర్ఫామెన్స్‌తో మ్యాచులు ఓడిపోయే ముంబై ఇండియన్స్, ఆ తర్వాత వరుస విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి శరవేగంగా దూసుకొస్తుంది. ఈ సీజన్‌లో కూడా అలాంటి కమ్‌బ్యాక్ ముంబై నుంచి ఆశిస్తున్నారు అభిమానులు.

Latest Videos

click me!