IPL 2023: సీఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే సీజన్‌లో సారథి ఎవరో తేల్చి చెప్పిన యాజమాన్యం

First Published Sep 4, 2022, 2:03 PM IST

Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)  ఇటీవల ముగిసిన సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. 

రెండు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్-15 సీజన్ లో  చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు కెప్టెన్లను మార్చింది. 2007 సీజన్ నుంచి 2021 వరకు ఆ జట్టుకు  టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని  కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ 2022 సీజన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ధోని.. తన బాధ్యతల నుంచి తప్పుకుని రవీంద్ర జడేజాకు సారథ్యం అప్పగించాడు. కానీ ఇది వర్కవుట్ అవలేదు. 
 

కెప్టెన్సీపై అంతగా అనుభవం లేని జడేజా.. తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 8 మ్యాచుల్లో చెన్నైకి సారథిగా ఉండి కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే జట్టును గెలిపించాడు. ఒత్తిడి తట్టుకోలేకో లేక యాజమాన్యంతో  విభేదాల కారణంగానో గానీ సీజన్ మధ్యలోనే జడేజా.. ఆ బాధ్యతలను తిరిగి ధోనికే అప్పజెప్పాడు. అయితే అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోవడంతో ఈ సీజన్ లో చెన్నై పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

Latest Videos


ఇదిలాఉండగా వచ్చే ఏడాది లెక్కలు సరిచేయాలని సీఎస్కే భావిస్తున్నది. మరి  ఇప్పటికే ధోని 40 ఏండ్లు దాటి మునపటి ఫిట్నెస్ లేక  ఇక ఆటకు గుడ్ బై చెప్పనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.  మరి  2023 సీజన్ లో చెన్నై కెప్టెన్ ఎవరు..? అనే ప్రశ్న  ఆ జట్టు అభిమానులతో పాటు ఐపీఎల్ ఫ్యాన్స్ లోనూ  ఆసక్తి నెలకొంది. 
 

ఈ ప్రశ్నకు తాజాగా సీఎస్కే సమాధనం చెప్పింది. ఆ జట్టు  సీఈవో కాశీ విశ్వనాథ్ ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘మా వైఖరిలో ఎలాంటి మార్పూ  లేదు.  సారథిని మార్చుతున్నామని మేమెప్పుడూ చెప్పలేదు..’అని కుండబద్దలు కొట్టాడు.  

ఈ ప్రకటనతో ఆయన రెండు విషయాలు స్పష్టం చేశాడు. అందులో ఒకటి వచ్చే సీజన్ లో కూడా ధోని ఐపీఎల్ ఆడనున్నాడు.  రెండోవది.. 2023 సీజన్ లో కూడా చెన్నైకి ధోనియే కెప్టెన్ అని చెప్పకనే చెప్పాడు. ఇది ధోని, చెన్నై, ఐపీఎల్ అభిమానులకు పూనకం తెప్పించేదే. 
 

ఐపీఎల్-15 సీజన్ లో  సీఎస్కేకు ఏదీ కలిసిరాలేదు.  జడేజా కెప్టెన్సీ, దీపక్ చాహర్ కు గాయం, రుతురాజ్ ఫామ్ కోల్పోవడం..  ఇలా ప్రతీది సీఎస్కేకు అనుకూలంగా జరగలేదు. అచ్చంగా  2020 సీజన్ లో కూడా  సీఎస్కే ఇలాగే పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కానీ 2021 సీజన్ లో ఏకంగా ఛాంపియన్ గా నిలిచింది. 

ఇక ధోని కూడా అదే పట్టుదలతో ఉన్నాడు. ఐపీఎల్ లో తాను ఇన్నాళ్లు సేవలందించిన జట్టుకు మరో కప్పును అందించి రిటైర్మెంట్ ప్రకటించాలనే భావనతో ఉన్నాడు. మరి ధోని లెక్కలు సరిచేస్తాడా..? అంటే వచ్చే ఏడాది మే వరకు ఆగాల్సిందే. 

click me!