Virat Kohli: కోహ్లీ ఫామ్ గురించి మాకు బెంగ లేదు.. దాని గురించే మేం ఆలోచించేది : రాహుల్ ద్రావిడ్

First Published Sep 4, 2022, 11:47 AM IST

Asia Cup 2022: విరాట్ కోహ్లీ ఫామ్ పై వస్తున్న విమర్శలను జట్టు యాజమాన్యం తిప్పికొడుతూనే ఉంది. ఇప్పటికే రోహిత్ శర్మ పలుమార్లు దీని మీద స్పష్టమైన ప్రకటన చేయగా తాజాగా ద్రావిడ్ కూడా.. 

మునపటి ఫామ్ ను కోల్పోయి  సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్ కోహ్లీకి టీమ్ మేనేజ్మెంట్ మద్దతుగా నిలుస్తున్నది.  కోహ్లీ ఫామ్ అనేది తమకు అసలు విషయమే కాదని ఇప్పటికే టీమిండియా సారథి రోహిత్ శర్మ గతంలో పలుమార్లు విలేకరుల సమావేశంలో కుండబద్దలుకొట్టాడు.  

తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా  కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నాడు. తమకు విరాట్ కోహ్లీ ఫామ్  గురించిన బెంగ లేదని ద్రావిడ్ స్పష్టం చేశాడు.  పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న ద్రావిడ్ ఆసక్తికర విషయాలు  పంచుకున్నాడు. 

ద్రావిడ్ మాట్లాడుతూ.. ‘నెల రోజుల విరామం తర్వాత కోహ్లీ మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. కోహ్లీ మళ్లీ ఫ్రెష్ గా క్రికెట్ ఆడుతుండటం చూస్తుంటే ముచ్చటేస్తోంది. అతడు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడాలని కోరుకుంటున్నాడు. ఈ టోర్నీలో కోహ్లీ మరిన్ని ఎక్కువ పరుగులు సాధిస్తాడని అనుకుంటున్నాం. 

మాకు కోహ్లీ  ఫామ్ గురించిన బెంగ లేదు. కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తున్నాడనేది మేం అంతగా పట్టించుకోం.  అతడి ఫామ్ గురించి గత కొద్దిరోజులుగా బయట చర్చ జరుగుతున్నది. కోహ్లీ ఫామ్, అతడు చేస్తున్న పరుగుల గురించి వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. మేమైతే కోహ్లీ నెంబర్ల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. 

పరస్థితులకు తగ్గట్టుగా కోహ్లీ ఎలా ఆడుతున్నదనేదే మాకు ముఖ్యం.  ఒక మ్యాచ్ లో కోహ్లీ 50 చేశాడా..? వంద చేశాడా..? అనేది మేం పట్టించుకోం.  కోహ్లీ 30 పరుగులు చేసినా చాలు. అవి జట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి..? అనేదే ప్రధానం. గత రెండు మ్యాచులలో కోహ్లీ ప్రదర్శన బాగుంది..’ అని  ద్రావిడ్ అన్నాడు. 

ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో ముగిసిన తొలి మ్యాచ్ లో 30 ప్లస్ స్కోరు చేసిన కోహ్లీ.. హాంకాంగ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.  కోహ్లీ స్ట్రైక్ రేట్  ఆందోళనకరంగా ఉన్నా అతడిలో గత రెండు ప్రదర్శనలు  కొండంత ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. దీంతో రాబోయే మ్యాచ్ లలో కూడా కోహ్లీ మెరుగైన ప్రదర్శనలు చేయడం పక్కా అని టీమిండియా ఫ్యాన్స్ అని భావిస్తున్నారు. 

click me!