బలి పశువును చేశారు.. బలిచ్చారు.. జడేజా విషయంలో సీఎస్కే యాజమాన్యంపై అనుమానాలెన్నో...

First Published May 12, 2022, 12:24 PM IST

Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు ఈ ఐపీఎల్ సీజన్  ఒక పీడకలగా  మారింది. వేలంలో అతడికి ధోని కంటే ఎక్కువ డబ్బులు చెల్లించి దక్కించుకున్న సీఎస్కే.. అతడిని బలి పశువును చేసిందంటున్నారు అతడి అభిమానులు. 

కెప్టెన్సీ మార్పు చెన్నై సూపర్ కింగ్స్ కు అచ్చిరానట్టు లేదు. ఈ సీజన్ కు  రెండ్రోజుల ముందు తాను కెప్టెన్సీ నుంచి వైదొలిగి.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు సారథ్య బాధ్యతలు అప్పగించాడు ధోని. అయితే 8 మ్యాచులకే జడ్డూ.. నా వల్ల కాదు బాబోయ్ అని దిగిపోయాడు.  

అయితే జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడం.. ధోని, సీఎస్కే యాజమాన్యం అతడిపై పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా జడేజా పనితీరు లేకపోవడంతో అతడిని తిరిగి జట్టులో సాధారణ ఆటగాడిగా మార్చింది. 

Latest Videos


ఒత్తిడి కారణంగా  జడ్డూను సారథిగా తప్పుకున్నాడని చెప్పిన సీఎస్కే..  ఆ తర్వాత ఒక్క మ్యాచ్ తర్వాత ఏకంగా అతడికి గాయం పేరిట విశ్రాంతినిచ్చింది. అతడు కెప్టెన్సీ కోల్పోయాక సీఎస్కే ఆడిన తర్వాతి రెండు మ్యాచులలో అతడికి చోటు దక్కలేదు. ఇక ఇప్పుడేమో ఏకంగా జడ్డూ.. గాయం కారణంగా మొత్తం సీజన్ నుంచే పక్కకు తప్పుకున్నాడని సీఎస్కే  తెలిపింది. 

పైకి గాయమని చెబుతున్నా.. సీఎస్కే యాజమాన్యానికి జడ్డూకు పడటం లేదని తెలుస్తున్నది. గాయంతో రెండు మ్యాచులకు జడ్డూ దూరంగా ఉన్నప్పుడు అతడు సీఎస్కే ఇన్స్టాగ్రామ్ పేజీని అన్ఫాలో చేశాడు. దాంతో సీఎస్కే-జడేజా మధ్య విభేదాలు వచ్చినట్టు  గుసగుసలు వినిపించాయి. 

ఇక తాజాగా ఇప్పుడు సీఎస్కే కూడా జడేజా ను ఇన్స్టాలో అన్ఫాలో చేసింది. దీనిని బట్టి చూస్తే  చెన్నై యాజమాన్యం-జడేజా మధ్య ఏదో జరిగే ఉంటుందనే అనుమానం బలపడినట్టైంది.  ఇదే విషయమై జడ్డూ అభిమానులు సీఎస్కేతో పాటు ధోనిని కూడా ఏకిపారేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా పలువురు ఫ్యాన్స్ స్పందిస్తూ ... ‘సీఎస్కే మేనేజ్మెంట్, ధోని లు చీప్ పాలిటిక్స్ వల్ల జడేజా బలయ్యాడు. ముందు అతడికి  కెప్టెన్సీ పేరు చెప్పి బలి పశువును చేశారు. తర్వాత అతడు సరిగా రాణించడం లేదని సీజన్ మధ్యలోనే  కెప్టెన్సీ నుంచి తప్పించారు...

 మళ్లీ ధోనికే పగ్గాలు అప్పజెప్పి అతడితోనే జడ్డూపై విమర్శలు చేయించారు. ఇప్పుడేమో  అతడిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడమే గాక గాయం పేరు చెప్పి ఐపీఎల్ లో బెస్ట్ ప్లేయర్ ను అవమానించారు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ట్విటర్ లో ఓ యూజర్ స్పందిస్తూ.. ‘ఏదో జరుగుతున్నది. జడేజా కెప్టెన్సీ  వదులకోవడానికి కూడా  సీఎస్కే యాజమాన్యంతో గొడవలే కారణం కావచ్చు. ఈ సీజన్ లో జడ్డూ తన సహజ ఆటతీరును కలిగిలేడు. ఆపై అతడి గాయం వార్తలు వచ్చాయి. ఇదంతా ఏదో మిస్టరీగా అనిపిస్తున్నది...’ అని రాసుకొచ్చాడు. 

click me!