ఇవేం చిల్లర కథలు..? గుజరాత్ టైటాన్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ఛాంపియన్లలా బిహేవ్ చేయండంటూ చురకలు

First Published Sep 18, 2022, 12:55 PM IST

Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ట్విటర్ వేదికగా చేసిన పని సోషల్ మీడియాలో ఆ జట్టు పరువు పోయేలా చేస్తున్నది.  ఏదో ఫన్ కోసం చేసేముందు ఆలోచించుకుని చేయాలని  నెటిజన్లు సూచిస్తున్నారు. 
 

ఇండియన్ ప్రీమియర్ లీగ్  (ఐపీఎల్) లో ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే ఏకంగా ట్రోఫీ నెగ్గిన జట్టు గుజరాత్ టైటాన్స్. దిగ్గజ ఆటగాళ్లు కలిగిన అగ్ర జట్లను  కూడా అలవోకగా ఓడించిన గుజరాత్.. తాజాగా చేసిన పని సోషల్ మీడియాలో ఆ జట్టుకు తలవొంపులు తీసుకువస్తున్నది.  

తమ జట్టు ఓపెనర్.. వేలానికి ముందే  రూ. 8 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఓపెనర్ శుభమన్ గిల్  తమ జట్టుకు దూరమవుతున్నాడని అర్థం వచ్చేలా గుజరాత్ టైటాన్స్ జట్టు ట్విటర్ లో షేర్ చేసిన ఓ ట్విస్ట్  ఇచ్చింది.  ఈ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. 

ట్విటర్ లో గుజరాత్ టైటాన్స్.. శనివారం మధ్యాహ్నం.. ‘గుజరాత్ టైటాన్స్ తో నీ ప్రయాణం మరువలేనిది. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలి’ అని  గిల్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. గిల్-గుజరాత్ నడమ విభేదాలు తలెత్తాయని.. అతడు సీఎస్కే కు ఆడనున్నాడని కాదు కేకేఆర్ కే తిరిగి వెళ్లనున్నాడని   కావాల్సినన్ని పుకార్లు షికార్లు చేశాయి.  

కానీ కొద్దిసేపటికి మళ్లీ.. అబ్బే.. మా ట్వీట్ కు అర్థం మీరనుకున్నది కాదు. గిల్ ఎక్కడికీ పోడు. మాతోనే ఉంటాడని స్పష్టతనిచ్చింది. దీంతో గుజరాత్ టైటాన్స్ తో పాటు శుభమన్ గిల్ ఫ్యాన్స్ కూడా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో  అంతా ముగిసినట్టే అనుకున్నారంతా... 

కానీ ఈ  ట్వీట్ తో జనాల చెవుల్లో పువ్వులు పెట్టినందుకు గాను నెటిజన్లు గుజారత్ టైటాన్స్ యాజమాన్యాన్ని ఆటాడుకున్నారు. అదే ట్విటర్ వేదికగా గుజరాత్ పోస్ట్ చేసిన ఆ ట్వీట్ ను పోస్టు చేస్తూ.. ‘మీరు ఛాంపియన్లు (2022 సీజన్ లో) అయ్యారు. కానీ  ఛాంపియన్ జట్టు ఎలా వ్యవహరించాలో తెలియండం లేదు.  ఏం చీప్ స్టంట్స్ ఇవి.   సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఇంతకు దిగజారుతారా..?  

Image credit: PTI

ఐపీఎల్ లో ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్.. నాలుగు ట్రోఫీలు నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడైనా  ఇలా ట్వీట్స్ చేశాయా..?  కొంచెం ఛాంపియన్లలా బిహేవ్ చేయండి..’ అని  గూబగుయిమనిపిస్తున్నారు. 

మరికొంతమంది యూజర్లు.. ‘స్టార్ట్ చేసింది మీరే..  దానికి ముగింపు ఇచ్చిందీ మీరే.. మళ్లీ నెపం మా మీద నెడుతున్నారు. మీ అతి తెలివికో దండం. కొంచెం డీసెంట్ టా ఉండటం నేర్చుకోండి..’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక.. ‘ఇంతకుమించి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలం..?’ అని  గుజారత్ టైటాన్స్ పరువు తీస్తున్నారు. 

ఇక గిల్ విషయానికొస్తే ఈ  పంజాబీ కుర్రాడు 2022 సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడి 132.22 స్ట్రైక్ రేట్ తో 483 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. కొన్ని మ్యాచ్ లలో గుజరాత్ కు మ్యాచ్ విన్నర్ గా  మారాడు.  

click me!