ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు భార‌త్ కు బిగ్ షాక్.. బుమ్రా ఏం చేస్తాడో మ‌రి !

First Published | Jan 12, 2025, 2:41 PM IST

Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ప్రదర్శన మెరుగ్గా ఉండాలంటే జ‌ట్టులో స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఉండాల్సిందే. అయితే, బుమ్రా వెన్నునొప్పి ఇప్పుడు టీమిండియాను అందోళ‌న‌కు గురిచేస్తోంది.
 

Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఈ ట్రోఫీని గెలుచుకోవాల‌ని భార‌త్ టార్గెట్ గా పెట్టుకుంది. అయితే, ఇటీవ‌ల జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న గ‌మ‌నిస్తే ప‌రిస్థితి మెరుగ్గా క‌నిపించ‌డం లేదు. ఇలాంటి సమ‌యంలో భార‌త జ‌ట్టుకు ప్ర‌స్తాతం ఫామ్ లో ఉన్న ప్లేయ‌ర్లు అవ‌స‌రం. అలాంటి ప్లేయ‌ర్ సేవ‌ల‌ను భార‌త్ కోల్పోయే ప్ర‌మాదంలో ప‌డింది. అత‌నే టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా.

ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నుంది. అయితే, ఇందులో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పాల్గొంటారా?  లేదా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో బుమ్రాకు వెన్ను నొప్పి వచ్చింది. ఆ తర్వాత స్కానింగ్‌కు కూడా వెళ్లాడు. కానీ, దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. 

Jasprit Bumrah

చాఫింయ‌న్స్ ట్రోఫీ-భార‌త్ కు బుమ్రా కీల‌కం 

ఛాంపియన్స్ ట్రోఫీ లో బుమ్రా అడ‌టంపై సందేహం నెల‌కొంది. మీడియా నివేదికల ప్రకారం, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీని సందర్శించాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతన్ని కోరింది. భారత్ తన ఛాంపియన్స్ ట్రోఫీలో త‌న తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న దుబాయ్‌లో ఆడ‌నుంది. త్వ‌ర‌లోనే జ‌ట్టును కూడా ప్ర‌క‌టించ‌నున్నారు. 

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ప్రదర్శన ఎక్కువగా బుమ్రా ఉనికిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు బుమ్రా వెన్ను నొప్పికి సంబంధించిన వివ‌రాలు బీసీసీఐ వెల్లడించలేదు. బుమ్రా గాయం గ్రేడ్ వన్ కేటగిరీలో ఉన్నట్లయితే, అతను గేమ్‌కు తిరిగి రావడానికి ముందు కనీసం మూడు వారాలు పునరావాసంలో గడపవలసి ఉంటుంది. గ్రేడ్ టూ గాయం నుండి కోలుకోవడానికి ఆరు వారాల వరకు పట్టవచ్చు, అయితే గ్రేడ్ త్రీ గాయం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తారు. కనీసం మూడు నెలల విశ్రాంతి, పునరావాసం అవసరం.


Jasprit Bumrah

జస్ప్రీత్ బుమ్రా ఎన్సీఏకు వెళ్తాడా? 

గాయం నేప‌థ్యంలో బుమ్రా పునరావాసం కోసం NCAకి వెళ్లే అవకాశ‌ముంద‌ని ప‌లు మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ప్రాథమిక నివేదికల ప్ర‌కారం.. ఫ్రాక్చర్ లేదు, కానీ అతని వెనుక భాగంలో వాపు ఉంది. అందువల్ల, అతని కోలుకోవడంపై NCA చ‌ర్య‌లు తీసుకుంటోంది. అతను మూడు వారాల పాటు అక్కడే ఉంటాడని పేర్కొంటున్నాయి. దీని త‌ర్వాత ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది, అవి అతని మ్యాచ్ ఫిట్‌నెస్ టెస్టుగా చూస్తారు.

BCCI ప్రస్తుతం బుమ్రా త్వరగా కోలుకుంటాడని ఆశిస్తోంది, అయితే అతని ఎంపికకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా తెలియదు. అతన్ని తాత్కాలిక జట్టులో చేర్చుకోవచ్చు, అయితే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటార‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

భార‌త్ - ఇంగ్లాండ్ సిరీస్ నుంచి బుమ్రాకు విశ్రాంతి?  

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో బుమ్రాకు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి బలమైన భారత జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు దృష్టి సారించారు. ఈ జట్టులో బుమ్రా ఒక ముఖ్యమైన ప్లేయ‌ర్. 

ఐదు మ్యాచ్‌ల టీ20, మూడు వన్డేల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు రానుంది. టీ20 సిరీస్ కోసం భారత జట్టును శనివారం ప్రకటించారు. వ‌న్డే జ‌ట్టును కూడా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. 

బోర్డర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో దుమ్మురేపిన బుమ్రా

ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో భార‌త్ 1-3 తేడాతో ఓడిపోయింది. అయితే, బుమ్రా అద్భుత‌మైన బౌలింగ్ 32 వికెట్లతో అద‌ర‌గొట్టాడు. వెన్ను నొప్పి కారణంగా ఈ 30 ఏళ్ల బౌలర్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. 

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అతను 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. అధిక పనిభారం కారణంగా బుమ్రా గాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్ కోసం అతను సిద్ధంగా ఉండేలా BCCI వైద్య బృందం ప్రయత్నాలు చేస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రదర్శన బుమ్రాపై ప్ర‌భావం 

చాంపియ‌న్స్ ట్రోఫీలో బుమ్రా భార‌త జ‌ట్టుకు ఒక బ‌లం. గ‌తేడాది మొత్తం అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చాడు. ప్ర‌స్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రపంచ కప్ లేదా ఈ ఫార్మాట్‌లో ఏదైనా ప్రధాన టోర్నమెంట్ లేనందున బుమ్రా ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక T20 అంతర్జాతీయ సిరీస్‌ను ఆడకూడదని దాదాపు నిర్ణయించారు. 

ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా, అతను ఇంగ్లండ్‌తో జరిగే మూడు  వ‌న్డే మ్యాచ్‌లలో కనీసం రెండు ఆడాలని భావించారు. అయితే, ఇప్పుడు అతని గాయం తీవ్రతను బట్టి అతను ఇంగ్లండ్‌తో జరిగే 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడగలడా లేదా అనేది నిర్ణయిస్తుంది. భారత్‌ జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుండగా, ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది.

Latest Videos

click me!