రోహిత్ శర్మ ఉండగా ఇంత మంది కెప్టెన్లు ఎందుకు... హిట్ మ్యాన్‌కి ఆ విషయం ఎవ్వరైనా గుర్తుచేయండి..

First Published Jul 7, 2022, 1:22 PM IST

టీమిండియా కెప్టెన్సీ కూడా మహారాష్ట్ర రాజకీయాల్లా మారిపోయింది. టీమిండియా కెప్టెన్ ఎవరు? అని అడిగితే సౌతాఫ్రికా సిరీస్‌కి రిషబ్ పంత్, ఐర్లాండ్ సిరీస్‌కి హార్ధిక్ పాండ్యా, ఇంగ్లాండ్‌కి ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా, టీ20 సిరీస్‌కి రోహిత్ శర్మ... అని మల్టీపుల్ ఛాయిస్ ఆన్సర్లు ఇవ్వాల్సిన పరిస్థితి. తాజాగా వెస్టిండీస్‌ టూర్‌కి ప్రకటించిన జట్టుకి కెప్టెన్‌గా శిఖర్ ధావన్ పేరు చూసి టీమిండియా ఫ్యాన్స్ షాక్ అయ్యారు...

Rohit Sharma

2022 ఏడాది ప్రారంభమైన ఆరు నెలల్లో ఆరు కెప్టెన్లను మార్చింది భారత జట్టు. సౌతాఫ్రికా టూర్‌కి ముందు వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ దక్కింది...

స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌ నుంచి రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ చేశాడు. రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు...

Latest Videos


రోహిత్ శర్మను టీమిండియాకి పూర్తి స్థాయి కెప్టెన్‌గా ప్రకటించినా, అతని వైఖరి చూస్తుంటే పార్ట్ టైమ్ కెప్టెన్‌గానే కనిపిస్తున్నాడు. కెప్టెన్సీ తీసుకున్న తర్వాత ఈ ఏడాది రోహిత్ శర్మ ఆడింది శ్రీలంక, వెస్టిండీస్‌లతో సిరీస్‌లు మాత్రమే... ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ మొత్తం ఆడితే... మూడో సిరీస్ అవుతుంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు నెలల పాటు ఎడతెడపి లేకుండా క్రికెట్ ఆడడం వల్ల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత కరోనాతో ఐదో టెస్టుకి దూరంగానే ఉన్నాడు. మరి అలాంటప్పుడు వెస్టిండీస్‌తో సిరీస్ ఆడడానికి అంత కష్టం ఏమొచ్చింది? అనేది అభిమానుల అనుమానం...

ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్లుగా ఉన్న సమయంలో ఐర్లాండ్‌తో సిరీస్‌ అయినా ఇంగ్లాండ్‌తో సిరీస్ అయినా కెప్టెన్లలో తేడా ఏమీ ఉండేది కాదు. కానీ రోహిత్ శర్మ విషయానికి వచ్చే సరికి రెస్టు తీసుకోవడానికి కారణాలు వెతుక్కుంటున్నట్టు అయిపోయింది పరిస్థితి...

జూలై 17న ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ అయిపోతే ఐదు రోజులకు వెస్టిండీస్ టూర్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ నుంచి వెస్టిండీస్‌కి వెళ్లి, అక్కడి పరిస్థితులకు అలవాటు పడడానికి ఈ సమయం సరిపోతుంది కూడా. మరి రోహిత్ శర్మ ఏమంత బిజీ క్రికెట్ ఆడేశాడని ఈ సిరీస్ నుంచి రెస్ట్ కావాలని కోరుకున్నాడనేది అభిమానుల అనుమానం...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు రోహిత్ శర్మ. ఇప్పటికీ రోహిత్ శర్మ అదే మూడ్‌లో ఉన్నట్టు ఉన్నాడని, తాను పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయాన్ని రోహిత్‌కి ఎవ్వరైనా గుర్తు చేయాలంటూ ట్రోల్స్ చేస్తున్నారు...

సిరీస్‌కో కెప్టెన్‌ని మార్చుతూ పోవడం ఏ జట్టుకైనా మంచిది కాదు. ఆటగాళ్లు కూడా ఇలా కెప్టెన్లను మారుస్తూ పోతే ఇబ్బంది పడతారు. టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీ ముందు ఇలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...

రోహిత్ శర్మ ఫిట్‌గా లేనప్పుడు, అతన్ని కెప్టెన్‌గా కొనసాగిస్తూ ఇలా సిరీస్‌కో నయా సారథిని వెతుక్కునే బదులు.. రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్‌లలో ఎవరికో ఒకరికి పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే పోతుందని కామెంట్లు చేస్తున్నారు.. 

click me!