బుమ్రా లేకుంటే మేం మ్యాచ్‌లు ఆడటం ఆపేయాలా..? మేం బౌలర్లం కాదా..? షమీ షాకింగ్ కామెంట్స్

First Published Jan 22, 2023, 3:13 PM IST

INDvsNZ: భారత క్రికెట్ జట్టు ఏడాదిన్నర కాలంగా స్వదేశంలో  ఒక్క వన్డే సిరీస్ కూడా కోల్పోకుండా    నిలకడగా రాణిస్తోంది.    గతేడాది  టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్  బుమ్రా లేకుండానే భారత్  అద్భుత విజయాలు అందుకుంది.

ఏడాదికాలంగా గాయాలతో సావాసం చేస్తున్న  జస్ప్రీత్ బుమ్రా తిరిగి  ఎప్పుడు భారత జట్టుతో చేరతాడన్నది  మీద స్పష్టత లేదు.  గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో  టెస్టు, వన్డే సిరీస్ ఆడిన బుమ్రా.. ఆ తర్వాత  గాయపడి  పలు ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు కీలక ఆసియా కప్, టీ20 ప్రపంచకప్  కు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. 

బుమ్రా లేకున్నా భారత్ అద్భుత విజయాలను అందుకుంటున్నది.  ఏడాదికాలంగా స్వదేశంతో పాటు విదేశాల్లోనూ టీమిండియాకు ఎదురేలేకుండా ఆడుతున్నది.   ఇటీవల ముగిసిన లంక తో వన్డే సిరీస్ తో పాటు తాజాగా కివీస్ తో  సిరీస్ లో కూడా  సిరాజ్.. బుమ్రా లేని లోటును పూరిస్తున్నాడు.  

న్యూజిలాండ్ తో రెండో వన్డేలో ఆ జట్టును దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించిన  షమీ.. బుమ్రా లేకున్నా  భారత జట్టు  విజయాలు సాధిస్తుందని అన్నాడు.  ఎవరో ఒకరు ఆటగాడు టీమ్ లో లేనంత మాత్రానా   మ్యాచ్‌లు ఏమీ ఆగిపోవని   చెప్పాడు. రాయ్‌పూర్ వన్డేలో  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన తర్వాత  షమీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడాడు. 

షమీ మాట్లాడుతూ.. ‘టీమ్ లోని ఒక ఆటగాడు గాయం కారణంగానో లేక ఫిట్నెస్ లేమి వల్లో జట్టు నుంచి దూరమైతే మేం కూడా నిరాశ చెందుతాం. అయితే ఒక ఆటగాడికి గాయమైందని  మేం మ్యాచ్ లు ఆడకుండా ఉండలేం కదా. వాళ్ల స్థానాన్ని మరో ఆటగాడు భర్తీ చేస్తాడు. 

మేం బుమ్రా ను చాలా మిస్ అవుతున్నాం.  అతడు మెరుగైన బౌలర్. అతడు త్వరలోనే మళ్లీ ఫిట్నెస్ సాధించుకుని తిరిగి జట్టుతో చేరతాడని ఆశిస్తున్నాం..’అని చెప్పాడు.  కాగా   న్యూజిలాండ్ తర్వాత కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ ఉండటంతో   అప్పటివరకైనా  బుమ్రా కోలుకుంటాడా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉంది. 
 

ఇదిలాఉండగా  టీమిండియా ప్రదర్శనలపై అడిగిన ఓ ప్రశ్నకు కూడా షమీ తనదైన శైలిలోనే సమాధానం చెప్పాడు. ‘మా జట్టు ప్రదర్శనపై అభిమానులకు ఎలాంటి అనుమానాలూ లేవు. గత కొన్నాళ్లుగా మేం మెరుగైన ప్రదర్శనలు ఇస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే వన్డే వరల్డ్ కప్ నాటికి వాటిని  నివృత్తి చేస్తాం.   ప్రపంచకప్ కు ముందు మాకు చాలా మ్యాచ్ లు మిగిలున్నాయి.  అవన్నీ ప్రాక్టీస్ గా ఉపయోగపడతాయి..’ అని తెలిపాడు. 

click me!