టీమిండియా మెంటర్లుగా సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ... వన్డే వరల్డ్ కప్ 2023పై ఆడమ్ గిల్‌క్రిస్ట్ సలహా...

First Published | Sep 21, 2023, 2:09 PM IST

 వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడే భారత జట్టు, ప్రపంచ కప్ సమయానికి టాప్ క్లాస్ టీమ్‌ని తయారుచేయాలని భావిస్తోంది. 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ లేకుండా భారత జట్టు ఆడుతున్న మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ ఇదే..
 

ICC World Cup 2011

ప్లేయర్‌గా 2007 వన్డే వరల్డ్ కప్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, కెప్టెన్‌గా 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచాడు. యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్ల కారణంగా 2011 వన్డే వరల్డ్ కప్‌లో విశ్వ విజేతగా నిలిచింది భారత జట్టు..

Rahul Dravid-Rohit Sharma

అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియానే టైటిల్ ఫెవరెట్. 2007 వన్డే వరల్డ్ కప్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్, ఈసారి భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు..


‘భారత క్రికెటర్‌గా ఉంటే ఎలాంటి ప్రెషర్ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇండియాలో మ్యాచ్ అంటే ఆ ప్రెషర్ మరింత ఎక్కువగా ఉంటుంది. వేల మంది అభిమానుల మధ్య ఆడుతూ, కోట్ల మధ్య ఆశలను మోయడం అంటే సాధారణ విషయం కాదు..

Dhoni sachin

అయితే సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ వంటి మాజీ ప్లేయర్లు వచ్చి, టీమిండియాతో సమయం గడిపేలా బీసీసీఐ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. వరల్డ్ కప్ గెలిచిన వారి అనుభవం, ఇప్పటి ప్లేయర్లకు బాగా ఉపయోగపడుతుంది..

Rohit Sharma and Yuvraj Singh

యువరాజ్ సింగ్, రియల్ ఫైటర్. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో కష్టాలను, క్యాన్సర్‌ని జయించి... టీమిండియాకి వరల్డ్ కప్ అందించాడు. అలాంటి ప్లేయర్లు వచ్చి 2011 వన్డే వరల్డ్ కప్ అనుభవాలను కొత్త ప్లేయర్లతో పంచుకోవాలి..

విరాట్ కోహ్లీ, 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అప్పుడు టీమ్‌, ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసిందో విరాట్‌కి బాగా తెలుసు. ఆ అనుభవం, మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ ఆడే ప్లేయర్లకు చాలా ఉపయోగపడుతుంది. వారిలో ఒత్తిడిని తగ్గిస్తుంది..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్..

అయితే 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇదే రకంగా ఆలోచించింది టీమిండియా మేనేజ్‌మెంట్. అప్పటికి రవిశాస్త్రి కోచింగ్‌లో, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుస విజయాలు అందుకున్న భారత జట్టు, టైటిల్ ఫెవరెట్‌గా 2021 టీ20 వరల్డ్ కప్ ఆడింది. అప్పటి బీసీసీఐ హెడ్ సౌరవ్ గంగూలీ, ధోనీని 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి మెంటర్‌గా నియమించాడు..

2021 ప్రపంచ కప్‌కి ముందు ప్లేయర్లు క్యాచ్ పట్టినా, వికెట్ తీసినా అంతా మాహీ మహిమ అంటూ టీవీ ఛానెళ్లు, కామెంటేటర్లు ఊదరకొట్టారు. అయితే పాక్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతుల్లో ఓడి గ్రూప్ స్టేజీ కూడా దాటలేకపోయింది..

సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ వంటి ప్లేయర్లు, టీమ్‌తో కలిసి వారి ఒత్తిడి తగ్గకపోగా పెరుగుతుందని, ఇది టీమ్ పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 2021లో భారత జట్టు పరిస్థితి, మళ్లీ రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని హెచ్చరిస్తున్నారు.. 

Latest Videos

click me!