భారత్ బలంగానే ఉన్నా సిరీస్ మాత్రం కంగారూలదే : రోహిత్ మాజీ కోచ్ ఝలక్

First Published Feb 6, 2023, 7:06 PM IST

Border Gavaskar Trophy: ఫిబ్రవరి 9 నుంచి మొదలుకాబోయే భారత్ - ఆస్ట్రేలియా సిరీస్ కోసం భారత అభిమానులే గాక  ప్రపంచ క్రికెట్ ప్రేమికులు  ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 
 

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) లో భాగంగా  ఫిబ్రవరి 9  నుంచి నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఫలితం ఎలా ఉండబోతుందనే విషయైమ క్రికెట్ విశ్లేషకులు, మాజీలు ఎవరికి తోచిన అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా  శ్రీలంక మాజీ సారథి, గతేడాది ఐపీఎల్ సీజన్ వరకూ  ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా వ్యవహరించిన  మహేళ జయవర్దెనే   ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఈ సిరీస్ లో  రెండు బలమైన జట్లే అని, స్వదేశంలో భారత్ ను ఓడించడం అంత ఈజీ కాకపోయినా  ఆస్ట్రేలియా మాత్రం సిరీస్ ను 2-1 తేడాతో నెగ్గుతుందని జోస్యం చెప్పాడు.   తొలి టెస్టును గెలుచుకున్నవారికి  సిరీస్ లో ఆధిపత్యం చెలాయించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని  చెప్పుకొచ్చాడు. 

తొలి టెస్టు ప్రారంభానికి ముందు  జయవర్దెనే మాట్లాడుతూ... ‘బీజీటీ  ఎప్పటికీ చారిత్రాత్మకమే. ఈ సిరీస్ లో భారత్  పరిస్థితులను కంగరూలు ఎలా ఎదుర్కుంటారనేది అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నది.  ఆస్ట్రేలియాకు మెరుగైన బౌలింగ్  యూనిట్ ఉంది.   వారిని ఇండియన్ బ్యాటర్లు ఎలా ఎదుర్కుంటారో చూడాలి.   

నాగ్‌పూర్ లో జరుగబోయే తొలి టెస్టులో ఎవరైతే విజయం సాధిస్తారో ఈ సిరీస్ లో వారు పట్టు సాధిస్తారు.   అయితే విజేతగా ఎవరు నిలుస్తారనేది చెప్పడం కష్టమే అయినా  భారత్ పై ఆసీస్ ఆధిక్యత  సాధిస్తుందని మాత్రం నేను భావిస్తున్నా..  అంతేగాక సిరీస్ ను కూడా 2-1 తేడాతో కంగారూలు గెలుచుకునే అవకాశం ఉంది. భారత్ కూడా ఈ సిరీస్ లో కంగారూలకు గట్టి పోటీనిస్తుంది..’అని వ్యాఖ్యానించాడు. 
 

కాగా 2004 నుంచి  భారత్ లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలవలేదు.  అదీగాక గత రెండు  సార్లు..  ఆస్ట్రేలియా వారి స్వదేశంలో టీమిండియా చేతిలో చావుదెబ్బ తింది.  2019-20, 2021లో  ఆ జట్టుకు స్వదేశంలో దారుణ పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో  ఈ సిరీస్ ను అది  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  

నెల రోజులు ముందుగానే టీమ్ ను ప్రకటించడం.. వారం రోజులు సిడ్నీలో ప్రత్యేకంగా స్పిన్ పిచ్ ను తయారుచేయించి  ఆటగాళ్లను ప్రాక్టీస్ చేయించడం..   భారత్ లో పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయి గనక  టీమ్ లో ఏకంగా నలుగురు స్పిన్నర్లను చేర్చడం..  బెంగళూరుకు వచ్చాక అశ్విన్ లా బౌలింగ్ వేసే  బౌలర్ తో బౌలింగ్ చేయించుకోవడం.. ఇలా అన్నీ ఓ పద్దతి ప్రకారం  చేస్తున్నది. ఇవన్నీ  భారత్  ను ధీటుగా ఎదుర్కునేందుకు  చేస్తున్నవే. ఇక ఆస్ట్రేలియాకు మాత్రమే తెలిసిన  స్లెడ్జింగ్..  ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేలా  మైండ్ గేమ్ వంటివి అన్నీ అనుసరిస్తోంది. మరి ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. 

click me!