బీసీసీఐ యూటర్న్.. సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా మళ్లీ అతడేనా..?

First Published Jan 3, 2023, 5:04 PM IST

BCCI:గతేడాది ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన  టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ఘోర వైఫల్యం తర్వాత  సెలక్షన్ కమిటీపై వేటు వేసిన  బీసీసీఐ.. తాజాగా యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. 

వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు, ఆసియా కప్ లో  టీమిండియా ఘోర వైఫల్యంతో  ఇటీవలే బీసీసీఐ..  చేతన్ శర్మ సారథ్యంలోని ఆలిండియా  సెలక్షన్ కమిటీపై వేటు వేసిన విషయం తెలిసిందే.  చేతన్ శర్మతో పాటు మరో ముగ్గురు సభ్యులను బాధ్యులుగా చేస్తూ   బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

వీరిని తొలగించిన వెంటనే కొత్త  సెలక్షన్ కమిటీకి నోటిఫికేషన్ జారీ చేయడం, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగిపోయింది. అయితే తాజాగా  టీమిండియా చీఫ్  సెలక్టర్ విషయంలో బీసీసీఐ  యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తున్నది.  2020 నుంచి  చీఫ్ సెలక్టర్ గా వ్యవహరిస్తున్న  చేతన్ శర్మకే తిరిగి ఆ పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గంగూలీ అండతో   సెలక్షన్ కమిటీ చైర్మెన్ పదవి దక్కించుకున్న  చేతన్ తో  బీసీసీఐ తిరిగి  మళ్లీ అప్లై చేయించినట్టు సమాచారం.  ఇటీవల టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు వైఫల్యంపై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో చేతన్ శర్మ కూడా పాల్గొన్నాడు.  ఈ సందర్భంగా సెలక్షన్ కమిటీ చైర్మెన్  చర్చ కూడా వచ్చినట్టు తెలుస్తున్నది.  

నిబంధనలకు అనుగుణంగానే చేతన్ తో పాటు సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న హర్వీందర్ సింగ్  కు కూడా తిరిగి ఛాన్స్ దక్కొచ్చనే   వార్తలూ వస్తున్నాయి. హర్వీందర్ సంగతి పక్కనబెడితే చేతన్ కు మాత్రం తిరిగి సెలక్షన్ కమిటీలో చోటు ఖాయమని, ప్రస్తుతం  ఈ పదవికి పోటీ పడుతున్న వారిలో  మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ తప్ప అతడికి మరే పోటీ లేదని బోర్డు వర్గాల సమాచారం. 

బీసీసీఐ ఇటీవలే నియమించిన  క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కూడా ఇదే విషయాన్ని బోర్డు సభ్యులకు విన్నవించినట్టు తెలుస్తున్నది.  సీఏసీలో సభ్యులుగా ఉన్న  అశోక్ మల్హోత్రా, జతిన్ పరన్‌జపె,  సులక్షణ నాయక్ లు కూడా చేతన్ వైపునకే మొగ్గుచూపుతున్నారని టాక్ వినిపిస్తున్నది. 

అన్నీ కుదిరితే  చేతన్ శర్మను  మరో రెండు మూడు రోజుల్లో చీఫ్ సెలక్టర్ గా నియమించే అవకాశాలున్నాయి.  స్వదేశంలో శ్రీలంకతో సిరిస్ ముగిసిన తర్వాత  న్యూజిలాండ్ భారత పర్యటనకు రానుంది. కివీస్ తో సిరీస్ కు భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. కొత్త సెలక్షన్ కమిటీ ఈ పని చేయాల్సి ఉంది.  చేతన్ శర్మ సారథ్యంలోని కొత్త సెలక్షన్ కమిటీనే కివీస్ తో మూడు వన్డేలు, మూడు టీ20లకు టీమ్ ను ఎంపిక చేయనున్నట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

click me!