పాక్‌లో అయితే మేం ఆడం! మీరు ఆడతారా? లేదా... ఆసియా కప్ 2023పై తేల్చనున్న జై షా...

First Published Feb 4, 2023, 3:03 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీ సమయంలోనే ఆసియా కప్ 2023 టోర్నీ గురించి చర్చ మొదలైంది. పాకిస్తాన్‌లో జరిగితే ఆసియా కప్ 2023లో టీమిండియా ఆడదని, తటస్థ వేదికపై టోర్నీ నిర్వహించి తీరుతామని బీసీసీఐ సెక్రటరీ జై షా వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం రేగింది. అప్పటి పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా ఘాటుగా స్పందించాడు. తన సీటును పోగొట్టుకున్నాడు...

ఆసియా కప్‌ కోసం టీమిండియా, పాక్‌కి రాకపోతే తాము ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడబోమని వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు రమీజ్ రాజా. పాకిస్తాన్ రాకపోతే ఇండియా ఆడే మ్యాచులు ఎవ్వరూ చూడరని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్ల కారణంగా పీసీబీ ఛైర్మెన్ పోస్టును పోగొట్టుకున్నాడు రమీజ్ రాజా...
 

గత నెలలో ఆసియా కప్ 2023 టోర్నీని యూఏఈ వేదికగా సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని  ప్రకటించింది ఏషియన్ క్రికెట్ కౌన్సిన్ (ఏసీసీ). అయితే షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో ఈ ఏడాది ఆసియా కప్ జరగాల్సి ఉంది.. దీంతో తమకు చెప్పకుండా వేదికను ఎలా మారుస్తారని నిలదీశాడు పీసీబీ ప్రస్తుత ఛైర్మెన్ నజమ్ సేథీ...

ఈ వివాదానికి పరిష్కారం తేల్చేందుకు ఏసీసీ ఛైర్మెన్‌గా ఉన్న బీసీసీఐ ప్రస్తుత సెక్రటరీ జై షా, బెహ్రాయిన్‌కి వెళ్లాడు. అక్కడ జరిగే ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనబోతున్నాడు జై షా...

Sourav Ganguly-Jay shah

‘ఆసియా కప్ 2023 విషయంలో బీసీసీఐ నిర్ణయం మారదు. కేంద్ర అనుమతి లేని కారణంగా భారత జట్టు, పాకిస్తాన్‌కి వెళ్లడం కుదరదు. యూఏఈ వేదికగా టోర్నీని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నాం. పీసీబీకి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ఈ మీటింగ్... ’ అంటూ చెప్పుకొచ్చాడు ఓ బీసీసీఐ అధికారి...

గత అక్టోబర్‌ 2022 సమయంలో ఆసియా కప్ కోసం భారత జట్టు, పాకిస్తాన్‌కి రాకపోతే తాము వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోమని స్టేట్‌మెంట్ విడుదల చేసింది పీసీబీ. అయితే అప్పటి పీసీబీ అధ్యక్షుడు ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఐసీసీ కూడా పాకిస్తాన్ జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడమని ఎలాంటి రాతపూర్వక స్టేట్‌మెంట్ తమకి ఇవ్వలేదని ఐసీసీ స్పష్టం చేసింది...

దీంతో ఆసియా కప్ 2023 టోర్నీ తటస్థ వేదికపై జరగడం, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాకిస్తాన్ జట్టు, భారత్‌లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే ఐసీసీ టోర్నీని బట్టి ఆసియా కప్ ఫార్మాట్ డిసైడ్ అవుతుంది.. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉండడంతో టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగగా ఈసారి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఉన్నందున వన్డే ఫార్మాట్‌లో 2023 ఆసియా కప్ జరుగుతుంది.. 

click me!