డిసెంబర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. పర్స్ వాల్యూ రూ. 5 కోట్లు పెంచిన బీసీసీఐ..!

First Published Sep 23, 2022, 6:02 PM IST

IPL 2023 Auction: ఐపీఎల్-16 కు సంబంధించిన ఆసక్తికర వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. వచ్చే సీజన్ కోసం బీసీసీఐ.. ఐపీఎల్ మినీ వేలాన్ని నిర్వహించనున్నది. అంతేగాక పర్స్ వాల్యూ కూడా  పెరగనుంది. 

ఐపీఎల్-15 ముగిసి మూడు నెలలు కావొస్తున్నది.  క్యాష్ రిచ్ లీగ్ తర్వాత సీజన్  వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో ప్రారంభమవుతుంది. అయితే ఐపీఎల్-16 కు సంబంధించిన ఆసక్తికర వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

వచ్చే సీజన్ కోసం బీసీసీఐ.. ఐపీఎల్ మినీ వేలాన్ని నిర్వహించనున్నది.  ఈ ప్రక్రియను డిసెంబర్ 16న నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి పెద్దలు చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది.  

వేలం తేదీని బీసీసీఐ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు.  అయితే వేలంతో పాటు ఈసారి ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ బ్యాలెన్స్ ను రూ. 95 కోట్లుగా నిర్ణయించారు. గత వేలంలో ఇది రూ. 90 కోట్లుగా ఉంది. రాబోయే సీజన్ కు రూ. 5 కోట్లు పెరగనుంది. 2024 (ఐపీఎల్-17) లో దీనిని వంద కోట్లకు పెంచే అవకాశాలున్నాయి. 

అయితే డిసెంబర్ 16న  నిర్వహించడం ఖాయమేనా.?  అనేది  బీసీసీఐ త్వరలోనే తేల్చనుంది.  మరికొద్దిరోజుల్లో బీసీసీఐ వార్షిక సమావేశం (ఏజీఎం) జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో మినీ వేలం తేదితో పాటు వేదికను కూడా ఖరారు చేయనున్నారు. 
 

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఇది మినీ వేలం. గతేడాది నిర్వహించిందే మెగా వేలం. తర్వాత వచ్చే మూడేండ్లూ మినీ వేలాలే. ఫ్రాంచైజీలు తమ జట్లలో సర్దుబాట్లు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఏడాది వేలం ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఏజీఎం తర్వాత తెలుస్తాయి..’ అని చెప్పాడు. 

ఇక ఈసారి వేలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్ రవీంద్ర జడేజా. పదేండ్లుగా సీఎస్కేతో ఆడుతున్న జడ్డూ.. వచ్చే సీజన్ లో ఫ్రాంచైజీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే జడేజా-సీఎస్కే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఐపీఎల్-15లో అతడికి సారథ్యం కట్టబెట్టి మధ్యలోనే దాన్నుంచి తొలగించడంతో జడ్డూ కోపంగా ఉన్నాడు. 
 

ఇక గత మూడు సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి ఐపీఎల్ పాత పద్ధతిలో రాబోతుంది. ఫ్రాంచైజీలు హోంగ్రౌండ్, బయటి గ్రౌండ్ లలో మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. అంటే వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ పది నగరాల్లో జరగనుంది. ఇది ఐపీఎల్ ఫ్యాన్స్ కు శుభవార్తే. 

click me!