పంత్ ధైర్యస్థుడు.. టీ20 ప్రపంచకప్‌లో అతడు తుది జట్టులో ఉండాలి : గిల్‌క్రిస్ట్

First Published Sep 23, 2022, 5:19 PM IST

T20I World Cup 2022: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్  రాబోయే టీ20 ప్రపంచకప్ కు దినేశ్ కార్తీక్ తో పాటు 15 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు. అయితే అతడు తుది జట్టులో ఉంటాడా..? లేడా..? అనేది మాత్రం అనుమానమే.. 
 

వచ్చే నెలలో ఆసీస్ లో మొదలుకాబోయే పొట్టి ప్రపంచకప్‌లో భారత  తుది జట్టులో కచ్చితంగా రిషభ్ పంత్ పేరుండాలని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్  గిల్‌క్రిస్ట్.  బౌలర్లపై విరుచుకుపడుతూ అద్భుత షాట్లు ఆడే పంత్ ను తుది జట్టులో తీసుకుంటే అది టీమిండియాకు మేలు చేస్తుందని తెలిపాడు. 

ఐసీసీ విడుదల చేసిన ఓ వీడియోలో గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘ఎటువంటి బౌలర్ అయినా ధైర్యంగా ఆడుతూ  బౌలర్లపై విరుచుకుపేడే తత్వం పంత్‌కు ఉంది. టీ20 ప్రపంచకప్ ఆడబోయే భారత తుది జట్టులో అతడు తప్పనిసరిగా ఉండాలి.  ఈ టోర్నీలో వాళ్లిదరూ (దినేశ్ కార్తీక్) కలిసి ఆడతారో లేదో నాకు తెలియదు గానీ  పంత్‌ మాత్రం కచ్చితంగా ఉండాలి..’ అని తెలిపాడు. 

టెస్టు, వన్డే క్రికెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న పంత్.. టీ20లలో మాత్రం  ఆ భరోసా దక్కించుకోలేకపోతున్నాడు.  మిగతా రెండు ఫార్మాట్లలో ఆడినట్టు పొట్టి ఫార్మాట్ లో రాణించలేకపోవడంతో టీమిండియాలో అతడు గట్టి పోటీని ఎదుర్కుంటున్నాడు. 

మరీ ముఖ్యంగా గడిచిన ఆరు నెలల కాలంలో పంత్.. కార్తీక్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కుంటున్నాడు. ఐపీఎల్-15 లో రెచ్చిపోవడం.. అంతకుముందు దేశవాళీలోనూ మెరుపులు మెరిపించడంతో సెలక్టర్ల కన్ను కార్తీక్ మీద పడింది. దీంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి ప్రతీ టీ20 సిరీస్ లో కార్తీక్ ఉంటున్నాడు. 

Sanju Samson Rishabh Pant

ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో  కార్తీక్, పంత్ ఇద్దరూ ఎంపికయ్యారు. కార్తీక్ తొలి మ్యాచ్ (పాకిస్తాన్) లో ఆడాడు. కానీ మిగిలిన నాలుగు మ్యాచ్ లలో పంత్ నే ఆడించింది టీమ్ మేనేజ్మెంట్.  అయితే పంత్ మాత్రం పాకిస్తాన్, శ్రీలంక తో మ్యాచ్ లలో దారుణంగా విఫలమయ్యాడు.  దీంతో  ఆస్ట్రేలియాతో తొలి టీ20లో పంత్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది.  రెండో టీ20లో కూడా అతడు ఆడతాడన్న గ్యారెంటీ లేదు. 

అయితే  టీ20 ప్రపంచకప్ లో పంత్ తో పాటు కార్తీక్ కూడా జట్టులో ఉండాలని గిల్‌క్రిస్ట్ చెబుతుండటం గమనార్హం. కార్తీక్  అనుభవజ్ఞుడైన ఆటగాడని.. అతడొక విలక్షణ బ్యాటర్ అని గిల్‌క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు.  

‘పంత్ తో పాటు కార్తీక్ కూడా  తుది జట్టులో ఉండాలి.  అతడు ఒక విలక్షణ బ్యాటర్. టాపార్డర్, మిడిలార్డర్ లోనే కాద.. ఫినిషర్ గా కూడా రాణించగలడు.  ఇటీవల మంచి ఫామ్ లో ఉన్నాడు..’ అని తెలిపాడు. 

click me!