ఫిఫా వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్.. బీసీసీఐ పట్టించుకోకున్నా మేమున్నామంటూ..

First Published Nov 28, 2022, 12:22 PM IST

టీమిండియా వికెట్ కీపర్  సంజూ శాంసన్ ను  భారత జట్టు  అవకాశాలివ్వక పదే  పదే అవమానించడం   తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.  అయితే సంజూను బీసీసీఐ పట్టించుకోకున్నా  అతడికి మేమున్నామంటూ.. 

న్యూజిలాండ్ వేదికగా ఇప్పటికే ముగిసిన టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ లో  కూడా  చోటు లేక ఎదురుచూపులతో కాలం వెల్లదీస్తున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కు సోషల్ మీడియాలో ఊహించని మద్దతు లభిస్తున్నది.  ఈ కేరళ ఆటగాడికి  అన్యాయం జరుగుతుందని,  పదే పదే విఫలమవుతున్నా రిషభ్ పంత్ ను ఆడిస్తున్న టీమ్ మేనేజ్మెంట్  దక్షిణాదికి చెందినవాడు కావడం చేతే  శాంసన్  ను పక్కనబెడుతుందన్న వాదనలూ  వినిపిస్తున్నాయి. 

అయితే బీసీసీఐ పట్టించుకోకున్నా  సంజూకు మాత్రం ఫ్యాన్ బేస్ తగ్గడం లేదు. టీ20 సిరీస్ తో పాటు  వన్డే సిరీస్ లో కూడా  సంజూకు మద్దతుగా చాలా మంది అభిమానులు న్యూజిలాండ్  లో ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ అతడికి మద్దతునిస్తున్నారు.  అతడు ఏం పాపం చేశాడని, సంజూ కెరీర్ ను నాశనం చేయొద్దని   బీసీసీఐ  కారాలు మిరియాలు నూరుతున్నారు. 

తాజాగా  సంజూ శాంసన్ ఫ్యాన్స్  ఖతర్ వేదికగా జరుగుతున్న   ఫిఫా ప్రపంచకప్ లో  కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్ లకు హాజరవుతూ  శాంసన్ కు మద్దతుగా బ్యానర్లు  ప్రదర్శిస్తున్నారు. 

సాధారణంగా గల్ఫ్ దేశాలలో  మళయాళీలు స్థిరపడ్డ విషయం తెలిసిందే.  సంజూ కూడా మళయాళీనే కావడంతో అక్కడి కేరళీయులు అతడికి మద్దతు తెలుపుతున్నారు. అంతేగాక ఫిఫా చూడటానికి వెళ్లిన పలువురు కేరళ ఫ్యాన్స్ కూడా  బ్యానర్లతో స్టేడియాలకు  హాజరవుతూ  అతడిపై ప్రేమను చాటుకుంటున్నారు. 

పలువురు   ఫ్యాన్స్.. ‘నిన్ను టీమిండియా  ఆడించినా ఆడించకపోయినా మేం నీతోనే ఉంటాం. నువ్వు ఏ జట్టు తరఫునా ఆడినా మంచిదే. మా మద్దతు ఎప్పుడూ నీకు ఉంటుంది..’ అని బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు.  సంజూ శాంసన్ ఫ్యాన్ పేజీ ఈ ఫోటోలను ట్విటర్ లో పోస్ట్ చేయగా   రాజస్తాన్ రాయల్స్ జట్టు  దానికి ‘అతడి మీద మీకున్న ప్రేమకు సలామ్..’ అని కామెంట్స్  చేయడం విశేషం. 

టీ20 వరల్డ్ కప్ లో సంజూను ఇగ్నోర్ చేసిన బీసీసీఐ..   ఇటీవల న్యూజిలాండ్ తో  ముగిసిన టీ20 సిరీస్ లో కూడా  పట్టించుకోలేదు.  వన్డే సిరీస్ లో తొలి వన్డేలో సంజూకు ఛాన్స్ ఇచ్చారు.  ఆ మ్యాచ్ లో సంజూ ఫర్వాలేదనిపించాడు. కానీ రెండో వన్డేలో మాత్రం సంజూకు అవకాశమివ్వలేదు. మరి బుధవారం జరిగే మూడో వన్డేలో అయినా  శాంసన్ కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి. 

click me!