టీమిండియాతో తొలి టెస్టుకి జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్... షకీబ్ కెప్టెన్సీలో బరిలోకి...

First Published Dec 9, 2022, 10:29 AM IST

టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచి, రెట్టించిన ఉత్సాహంతో ఉంది బంగ్లాదేశ్. తొలి వన్డేలో 136 పరుగులకే 9 వికెట్లు పడిపోయిన తర్వాత కూడా ఆఖరి వికెట్‌కి 51 పరుగులు జోడించి ఘన విజయం అందుకున్న బంగ్లాదేశ్, రెండో వన్డేలో 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా 271 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది...

తొలి వన్డేలో టీమిండియాకి విజయాన్ని దూరం చేసిన మెహిదీ హసన్ మిరాజ్, రెండో వన్డేలో రికార్డు సెంచరీతో చెలరేగి... బంగ్లాను గెలిపించాడు. డిసెంబర్ 10న ఆఖరి వన్డే ఆడే బంగ్లాదేశ్, ఆ తర్వాత టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది...

డిసెంబర్ 14న ఛటోగ్రామ్‌లో బంగ్లాదేశ్- టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టుకి 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు... టీమిండియా ఏ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 173 పరుగులు చేసి మెప్పించిన బంగ్లాదేశ్ ఏ టీమ్ ఆటగాడు జాకీర్ హసన్‌కి తొలి టెస్టులో అవకాశం కల్పించింది బంగ్లా బోర్డు...

Taskin Ahmed

బంగ్లాదేశ్ ఫస్ట్ క్లాస్ లీగ్ నేషనల్ క్రికెట్ లీగ్‌‌లో 56.25 సగటుతో 442 పరుగులు చేసి మెప్పించిన జాకీర్ హసన్.. గత ఐదేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నాడు. అలాగే గాయం కారణంగా వన్డే సిరీస్‌కి దూరమైన టస్కీన్ అహ్మద్, టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు...

అయితే వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. తమీమ్ ఇక్బాల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో 10 రోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో డిసెంబర్ 22న మీర్‌పూర్‌లో జరిగే రెండో టెస్టులో తమీమ్ ఇక్బాల్‌కి చోటు దక్కొచ్చు...

Bangladesh Test

బంగ్లాదేశ్‌తో ఇప్పటిదాకా 11 టెస్టులు ఆడిన టీమిండియా, ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 9 టెస్టుల్లో గెలిచిన టీమిండియా, రెండు టెస్టులను డ్రాగా ముగించుకుంది. అయితే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ చేరాలని ఆశపడుతున్న టీమిండియా, ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ రెండు టెస్టులు గెలిచి తీరాల్సిందే...

టీమిండియాతో తొలి టెస్టుకి బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హుస్సేన్ షాంటో, మోమినుల్ హక్, యాసిర్ ఆలీ చౌదరీ, ముస్తఫికర్ రహీం, లిట్టన్ దాస్, క్వాజీ నురుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తయిజుల్ ఇస్లాం, టస్కీన్ అహ్మద్, ఖలీద్ అహ్మద్, ఎబదత్ హుస్సేన్, షరీఫుల్ ఇస్లాం, జకీర్ హసన్, రహ్మన్ రాజా, అనమోల్ హక్
 

టెస్టు సిరీస్‌కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడంతో అతని స్థానంలో కెఎల్ రాహుల్ కెప్టెన్సీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రవీంద్ర జడేజా ఇంకా కోలుకోకపోవడం, మహ్మద్ షమీ గాయంతో జట్టుకి దూరం కావడంతో టీమిండియాలో మార్పులు జరగడం అనివార్యంగా మారింది..

click me!