టీ20లలో బాబర్ ఆజమ్ - మహ్మద్ రిజ్వాన్ ల జోడీ గత కొన్నాళ్లుగా సంచలన ప్రదర్శనలతో ముందుకు సాగుతున్నది. ఈ ఇద్దరూ కలిసి కీలక భాగస్వామ్యాలతో పాకిస్తాన్ వరుస విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే బాబర్ టీ20లలో ఓపెనర్ గా పనికిరాడని.. అతడు బ్యాటింగ్ పొజిషన్ మార్చుకుంటేనే మంచిదని అంటున్నాడు ఆ జట్టు మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయభ్ అక్తర్. తాజాగా భారత్ తో మ్యాచ్ లో బాబర్ విఫలమయ్యాక అతడు తన అభిప్రాయాన్ని బల్లగుద్ది మరీ చెప్పాడు. బాబర్ తో పాటు మహ్మద్ రిజ్వాన్ ఆటతీరుపైనా అక్తర్ విమర్శలు గుప్పించాడు.
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ ముగిశాక అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘భారత్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ ప్రదర్శన ఏమీ బాగోలేదు. ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలో పరుగులు చేస్తేనే ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచగలం.
కానీ బంతికి ఒకే పరుగు అన్న రీతిలో సాగింది పాక్ ఇన్నింగ్స్. తొలి పవర్ ప్లేలో ఏకంగా 19 డాట్ బాల్స్ అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మహ్మద్ రిజ్వాన్ బంతికి ఒక పరుగు అన్న రీతిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీ20 ఫార్మాట్ లో ఇలా ఆడితే తిప్పలు తప్పవు.
ఇక బాబర్ ఆజమ్ టీ20లలో ఓపెనర్ గా బరిలోకి దిగవద్దని నేను చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నా. కానీ అతడు పదే పదే అదే తప్పులు చేస్తున్నాడు. టీ20లలో బాబర్ ఓపెనర్ గా కాకుండా వన్ డౌన్ లో బ్యాటింగ్ కు రావాలి. అప్పుడు అతడు చివరివరకు ఉండగలిగే అవకాశం ఉంటుంది..’ అని అన్నాడు.
ఈ మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్లు తప్పులు చేశారని అక్తర్ వాపోయాడు. బాబర్ ఆజమ్.. తన జట్టులో బ్యాటింగ్ కూర్పును సరిగా చేయలేదన్నాడు. ఇఫ్తికర్ అహ్మద్ ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపడం సరైంది కాదని నా అభిప్రాయం. నాకు ఇప్తికర్ మీద ఏ పగా లేదు.
ఇక భారత జట్టులో కూడా రోహిత్ శర్మ.. రిషభ్ పంత్ ను పక్కనబెట్టి తప్పు చేశాడు. అతడు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నప్పుడు.. టీ20 ప్రపంచకప్ ముందున్న తరుణంలో భారత్ ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు..’ అని వీడియోలో పేర్కొన్నాడు.