మొన్న వెస్టిండీస్‌పై, ఇప్పుడు బంగ్లాదేశ్‌‌తోనూ... ఆస్ట్రేలియా కూడా ఈ రెండు టీమ్స్‌తో చేరినట్టేనా...

First Published Aug 5, 2021, 3:12 PM IST

ఆస్ట్రేలియా... దశాబ్దం కిందట ఈ జట్టుతో ఆడాలంటేనే ప్రత్యర్థులు భయపడేవాళ్లు. ఆస్ట్రేలియాను ఓడించడమంటే అసాధ్యమనే భావించేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ మారింది... శ్రీలంక, సౌతాఫ్రికా జట్లలాగే ఆస్ట్రేలియా కూడా టాప్ టీమ్స్ లిస్టు నుంచి పడిపోయేలాగే కనిపిస్తోంది.

మిగిలిన జట్ల కంటే అత్యధికంగా ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచింది ఆస్ట్రేలియా. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచంతో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించిన ఆస్ట్రేలియా, టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత మిగిలిన జట్ల జోరు ముందు నిలవలేకపోతోంది...

ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు, టీ20 వరల్డ్‌కప్ టోర్నీని ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, వెస్టిండీస్ వంటి జట్లు పొట్టి వరల్డ్‌కప్‌లో విజయాలు సాధిస్తుంటే.. ఆసీస్ మాత్రం ఇప్పటిదాకా ఆ ఆశ నెరవేర్చుకోలేకపోయింది.

2010లో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది ఆస్ట్రేలియా.. ఇప్పుడు వరుసగా మ్యాచుల్లో ఘోరమైన ప్రదర్శన ఇస్తోంది...

విండీస్ టూర్‌లో 4-1 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. టీ20 వరల్డ్‌కప్‌కి నేరుగా అర్హత సాధించలేకపోయిన బంగ్లా చేతుల్లోనే ఓడుతుందంటే ఆసీస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు...

విండీస్ టూర్‌లో ఆసీస్‌ను నడిపించిన ఆరోన్ ఫించ్ గాయం కారణంగా తప్పుకోవడంతో మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్లు లేకుండా బరిలో దిగుతున్న ఆస్ట్రేలియా, బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడానికి కూడా తెగ ఇబ్బందులు పడుతోంది...

బంగ్లాతో జరిగిన తొలి టీ20లో 108 పరుగులకి ఆలౌట్ అవ్వగా, రెండో టీ20లో 20 ఓవర్లలో 121 పరుగులకే పరిమితమైంది. స్టీవ్ స్మిత్, టీ20 వరల్డ్‌కప్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

డేవిడ్ వార్నర్ గాయాలతో బాధపడుతున్నాడు. మ్యాక్స్‌వెల్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాడో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, టీ20 వరల్డ్‌కప్‌లో ఎలా ఆడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...

ఆస్ట్రేలియా బలహీనంగా తయారయ్యిందా? లేక మిగిలిన జట్లు బలంగా తయారయ్యాయా? అర్థం కావడం లేదు. అయితే ఆసీస్ క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ ఆటతీరు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. 

click me!