ధోనీ ఫార్ములాని వాడబోయి ఫ్లాప్ అయిన విరాట్ కోహ్లీ... 2014 ఆసియా కప్‌ పరాభవాన్ని మరిచిపోని ఫ్యాన్స్...

First Published Aug 24, 2022, 5:51 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. మాహీ ఏం ఆలోచిస్తాడో కానీ అతను చేసిన కొన్ని ప్రయోగాలు, టీమిండియాకి భలే కలిసొచ్చాయి. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆఖరి ఓవర్‌ని జోగిందర్ శర్మకు అప్పగించడం... అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.హర్భజన్ సింగ్ రూపంలో సీనియర్ ఉన్నా, పెద్దగా అనుభవం లేని జోగిందర్‌కి బాల్ అందించి... ఫలితం సాధించాడు మాహీ...

2014 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సరిగ్గా ఇలాంటి ఫార్ములాని వాడబోయి అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. 2014 ఆసియా కప్ ఆరంభానికి ముందు గాయపడిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఫలితంగా విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ... 
 

పేలవ ఫామ్ కారణంగా యువరాజ్ సింగ్, సురేష్ రైనా వంటి సీనియర్లకు కూడా ఆసియా కప్ 2014 టోర్నీకి ఎంపిక చేయలేదు సెలక్టర్లు. వీరి స్థానంలో అజింకా రహానే, దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు వంటి ప్లేయర్లకు మిడిల్ ఆర్డర్‌లో అవకాశం దక్కింది.

ఆసియా కప్ చరిత్రలో గత ఆరు మ్యాచుల్లో పాక్ చేతుల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది టీమిండియా. అది 2014 సీజన్‌లో... ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 245 పరుగుల ఓ మాదిరి స్కోరు చేసింది...

రోహిత్ శర్మ 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేయగా అంబటి రాయుడు 62 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేశాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
శిఖర్ ధావన్ 10, విరాట్ కోహ్లీ 5, అజింకా రహానే 23, దినేశ్ కార్తీక్ 23, రవిచంద్రన్ అశ్విన్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు...

Mohammad Hafeez

246 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌కి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు షార్జీన్ ఖాన్, అహ్మద్ షాజద్ కలిసి 11 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు మహ్మద్ హఫీజ్ 117 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు...

హఫీజ్ అవుట్ అయిన తర్వాత 36 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. ఆఖరి ఓవర్‌లో పాక్ విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చాయి. అప్పటికే భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా 10 ఓవర్ల కోటా పూర్తి చేసుకున్నారు. దీంతో మరో దారి లేక రవిచంద్రన్ అశ్విన్‌కి ఆఖరి ఓవర్ వేసేందుకు బంతిని అందించాడు విరాట్ కోహ్లీ...

afridi

మొదటి వికెట్‌కే సయ్యద్ అజ్మల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు అశ్విన్. అయితే ఆ తర్వాతి బంతికి సింగిల్ తీసిన జునైద్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదీకి స్ట్రైయిక్ ఇచ్చాడు. విధ్వంసకర బ్యాటర్లలో ఒకడైన షాహిదీ ఆఫ్రిదీ... రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది... మ్యాచ్‌ని ముగించేశాడు...

ravichandran ashwin

స్పిన్నర్‌‌ అశ్విన్‌తో మిగిలిన ఓవర్ ముందుగానే వేయించి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీల్లో ఒకరికి ఆఖరి ఓవర్ ఇచ్చి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే ఈ ఓవర్‌లోకి ముందు 9 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన అశ్విన్‌ని నమ్మిన విరాట్ కోహ్లీ, ఆఖరి ఓవర్‌లో బౌలింగ్ ఇచ్చి భారీ మూల్యం చెల్లించుకున్నాడు.. 

ఈ పరాజయంతో గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచుల్లో నెగ్గి, రెండింట్లో ఓడిన టీమిండియా.. ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అనుభవలేమితో పాటు యువీ, రైనా వంటి సీనియర్లను పక్కనబెట్టి 2014 ఆసియా కప్‌ బరిలో దిగిన భారత జట్టు ఫీల్డింగ్‌లోనూ విలువైన క్యాచులను జారవిడిచి... 2014 ఎడిషన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. 

click me!