Asia Cup:రోహిత్ రిస్క్ చేస్తున్నాడా..? లేక టీ20 ప్రపంచకప్ సన్నాహకాలేనా..? రిషభ్‌ను తప్పించడం వెనుక మర్మమేమిటి?

First Published Aug 29, 2022, 1:04 PM IST

India Vs Pakistan: పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఆల్ ఫార్మాట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను కాదని  దినేశ్ కార్తీక్ కు అవకాశమిచ్చాడు రోహిత్ శర్మ. 

పాకిస్తాన్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో  టీమిండియా సారథి రోహిత్ శర్మ తీసుకున్న ఓ నిర్ణయం  అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉన్న రిషభ్ పంత్ ను కాదని  రోహిత్.. పాకిస్తాన్ తో మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ కు అవకాశమిచ్చాడు. 

రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులు ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. రోహిత్ రిస్క్ చేస్తున్నాడని  కొందరు అంటుంటే మరికొందరేమో అతడు చాలా పెద్ద తప్పు చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.  మరో రెండు నెలలలో టీ20 ప్రపంచకప్  పెట్టుకుని పూర్తి స్థాయి జట్టును ఇప్పటికే సిద్ధం చేయాల్సింది పోయి ఇంకా  ప్రయోగాల పేరిట కాలక్షేపం చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. 
 

టాస్ సందర్భంగా రోహిత్.. ‘ఈ మ్యాచ్ లో మేం  దినేశ్ కార్తీక్ తో ఆడుతున్నాం. దురదృష్టవశాత్తూ రిషభ్ పంత్  డగౌట్ కే పరిమితమయ్యాడు.. జట్టుకు ఏం కావాలో పంత్ కు తెలుసు..’ అని అన్నాడు. 
 

Image credit: PTI

అయితే రోహిత్ నిర్ణయమేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. అక్టోబర్ లో జరుగబోయే టీ20  ప్రపంచకప్ కోసం ఇప్పటికే జట్టును తయారుచేసేపనిలో పడ్డ రోహిత్.. దానికి తుది మెరుగులు దిద్దుతున్నాడని టాక్ నడుస్తున్నది.  గతంలో ఫామ్ కోల్పోయి ఇక కెరీర్ ముగిసిందనుకుంటున్న తరుణంలో తిరిగి రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు కార్తీక్. వచ్చే టీ20   ప్రపంచకప్ లో ఆడటమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఆ మేరకు సఫలీకృతమవుతున్నాడు కూడా.. 
 

వికెట్ కీపర్లలో భారత్ గతంలో ఎన్నడూ లేని పోటీని ఎదుర్కుంటున్నది. దినేశ్ కార్తీక్ తో పాటు రిషభ్ పంత్, సంజూ శాంసన్ వంటి పలువురు టాలెంటెడ్ క్రికెటర్లు కూడా టీ20 ప్రపంచకప్ లో చోటు కోసం తాపత్రయపడుతున్నారు. మిగతావారి సంగతి పక్కనబెడితే రిషభ్ వేరు. ధోని నిష్క్రమణ తర్వాత పంత్.. భారత జట్టుకు రెగ్యులర్ వికెట్ కీపర్ అయ్యాడు. వికెట్ కీపింగ్ తో పాటు పంత్ మిడిలార్డర్ తో పాటు ఓపెనర్ గానూ రాణించగల  సమర్థుడు. 

Image credit: PTI

అయితే గడిచిన ఆరు నెలలుగా పంత్-కార్తీక్  ఇద్దరికీ అవకాశాలిస్తున్నది టీమిండియా. ఈ ఇద్దరూ కలిసి ఆడుతున్న సందర్భాలూ ఉన్నాయి.  సాధారణ మ్యాచ్ ల సంగతి అటుంచితే కీలక టోర్నీలలో ఈ ఇద్దరినీ  తుది జట్టులో ఆడించడం కుదరడం లేదు. దీంతో ఎవరో ఒకరికే అవకాశం దక్కుతున్నది. ఆ క్రమంలోనే కార్తీక్ కు పాకిస్తాన్ తో మ్యాచ్ లో అవకాశం దక్కింది. 

ఈ ఇద్దరిలో ఎవరినీ తక్కువ చేయడానికి లేదు. గణాంకాలు,  ప్రదర్శనలపరంగా చూసినా ఈ ఇద్దరూ ఎవరికీ వారే బెస్ట్ అన్న విధంగా రాణిస్తున్నారు. ఈ టోర్నీలో మరో రెండు మూడు మ్యాచులలో పంత్ ను కాదని దినేశ్ కార్తీక్ నే  వికెట్ కీపర్ గా తీసుకుంటే మాత్రం.. టీ20 ప్రపంచకప్ లో అతడికి చోటు దక్కడం ఖాయమేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
 

click me!