రోహిత్ అభిమానిని చంపిన విరాట్ ఫ్యాన్... కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్...

First Published | Oct 15, 2022, 12:03 PM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రూపంలో ఒకే టీమ్‌లో ఇద్దరు లెజెండరీ బ్యాటర్స్, కెప్టెన్లు ఉండడం టీమిండియా అదృష్టం. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప కెప్టెన్ అనే విషయంలో అభిమానుల మధ్య గొడవలు చాలా ఏళ్ల నుంచే జరుగుతున్నాయి. తాగిన మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఇలాంటి ఓ గొడవే, ఓ వ్యక్తి ప్రాణం తీసింది...

క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండే తమిళనాడులో ఓ 21 ఏళ్ల యువకుడు (ధర్మరాజ్) తన స్నేహితుడిని (విగ్నేశ్) కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ హత్యకు అసలు కారణం తాగిన మత్తులో ఈ ఇద్దరి మధ్య విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి జరిగిన చర్చ, గొడవకు దారి తీసి.. చివరికి ఓ ప్రాణం తీసింది...

మల్లూర్‌కి చెందిన ధర్మరాజ్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయితే అదే గ్రామానికి చెందిన విగ్నేశ్, రోహిత్ శర్మకు డై హార్ట్ ఫ్యాన్. ప్రాణ స్నేహితులైన ఈ ఇద్దరికీ క్రికెటర్ల విషయంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. శుక్రవారం ఈ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఫుల్లుగా కిక్ ఎక్కిన తర్వాత కోహ్లీ, రోహిత్ గురించి చర్చ రావడం, విగ్నేశ్ విరాట్‌ని దూషిస్తూ మాటలు అనడంతో ఆగ్రహానికి గురైన ధర్మరాజ్, స్నేహితుడిపై కత్తితో దాడి చేసి చంపేశాడు...


Image credit: PTI

ఈ సంఘటన తర్వాత ‘#ArrestKohli’ హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆర్‌సీబీ ఫ్యాన్స్ కాస్త అతి చేస్తుంటారు. టీమిండియా ఆడే మ్యాచుల్లోనూ ‘ఆర్‌‌సీబీ... ఆర్‌సీబీ’ అంటూ గోల చేస్తూ భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి చిరాకు తెప్పించే ఛాలెంజర్స్ ఫ్యాన్స్, ఇప్పుడు ఓ వ్యక్తి ప్రాణం తీసే స్థాయికి చేరుకున్నారని ఆరోపిస్తున్నారు నెటిజన్లు.. 
 

Image credit: PTI

ఇంతకుముందు టీమిండియాలో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి లెజెండరీ క్రికెటర్లు ఉండేవాళ్లు. ఓ సందర్భంలో సచిన్ గొప్పా? సెహ్వాగ్ గొప్పా? అనే చర్చ కూడా అభిమానుల మధ్య జరిగింది. అయితే ఎప్పుడూ అభిమానుల మధ్య ఈ స్థాయిలో విభేదాలు రావడం, గొడవలు జరిగిన సందర్భాలు లేవు...

విరాట్, రోహిత్ శర్మ అభిమానుల మధ్య వైరం ఈస్థాయికి చేరుకోవడానికి బీసీసీఐ పెట్టిన చిచ్చు కూడా ఓ కారణం. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ, ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. దీంతో రోహిత్‌పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోపం కాస్త ద్వేషంగా మారింది...

Image credit: IPL

టెస్టుల్లో ఐదేళ్ల పాటు టీమ్‌ని టాప్‌లో నిలిపిన విరాట్ కోహ్లీ గొప్పని ఆయన అభిమానులు అంటే, కాదు ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శర్మనే గొప్ప కెప్టెన్ అని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ వాదిస్తారు. ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ఇచ్చేదాకా చర్చకు ఫుల్‌స్టాప్ పడదేమో...

Latest Videos

click me!