ఇంట్లో ప్రపంచ నెంబర్‌వన్ ఆటగాడిని పెట్టుకుని క్రికెట్ కోచింగ్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న అనుష్క శర్మ

First Published Aug 5, 2022, 4:04 PM IST

Anushka Sharma: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ త్వరలోనే ఇంగ్లాండ్ కు వెళ్లనున్నది. అక్కడ ఆమె క్రికెట్ పాఠాలు నేర్చుకోనున్నది. 

విరాట్ కోహ్లీ.. పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి అభిమానాన్ని పొందుతున్న దిగ్గజం.  కోహ్లీ  ఆట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు. 70 సెంచరీలు, వేలాది పరుగులు, వందలాది రికార్డులు, కోట్లాది మంది అభిమాన గణం. 

ఇంతపేరు ఉన్నా కోహ్లీ భార్య అనుష్క శర్మ మాత్రం క్రికెట్ కోచింగ్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్నది. ప్రపంచంలో భీకర బౌలర్లను అవలీలగా ఎదుర్కున్న కోహ్లీని కాదని అనుష్క శర్మ  ఇంగ్లాండ్ ఎందుకు వెళ్తుంది..?

అనుష్క శర్మ.. బాలీవుడ్ లో కొత్త చిత్రం చేస్తున్నది. టీమిండియా మహిళా క్రికెట్ జట్టులో దిగ్గజ బౌలర్ జులన్ గోస్వామి జీవిత  నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం చక్డా ఎక్స్ప్రెస్. ఈ సినిమాలో జులన్ పాత్రను అనుష్క శర్మ పోషిస్తున్నది. 
 

ఇందుకు సంబంధించిన ట్రైలర్ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఈ చిత్రంలోని ఫస్ట్ షెడ్యూల్ ను కూడా అనుష్క శర్మ ఇప్పటికే పూర్తి చేసింది. సినిమాలో క్రికెట్ ఆడే సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ వాటిమీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. 

ఈ మేరకు అనుష్క శర్మ త్వరలోనే ఇంగ్లాండ్ కు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. ఫిట్నెస్ తో పాటు ఆటకు సంబంధించిన మెలుకువలు, జులన్ బౌలింగ్ శైలి, తదితర అంశాల మీద అనుష్క  ప్రత్యేక శిక్షణ తీసుకోనుందని చిత్ర బృందం తెలిపింది.  

ఈ చిత్రాన్ని జనవిరిలో విడుదల చేసేందుకు  చిత్ర నిర్మాతలు (అనుష్క శర్మ, ఆమె సోదరుడు కర్నేశ్ శర్మ కలిసి నిర్మిస్తున్నారు) ప్లాన్ చేస్తున్నారు.  థియేటర్లతో పాటు నెట్‌ఫ్లిక్స్ లో కూడా ఏకకాలంలో స్ట్రీమింగ్ కానున్నది. 

ఇక జులన్ గోస్వామి కెరీర్ విషయానికొస్తే... 39 ఏండ్ల ఈ లెజెండరీ బౌలర్ ఇప్పటివరకు 281 అంతర్జాతీయ (టెస్టులు, వన్డేలు, టీ20లు కలిసి) మ్యాచులు ఆడి 351 వికెట్లు పడగొట్టింది. ఫిబ్రవరిలో ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత మళ్లీ ఆమె మ్యాచ్ ఆడలేదు. త్వరలోనే ఆమె రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది.  

click me!