కేకేఆర్ కు మరో షాక్.. రూ. 7 కోట్ల ఆటగాడికి గాయం.. సీజన్ నుంచి ఔట్

First Published May 13, 2022, 12:48 PM IST

Pat Cummins Ruled Out: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో వెనుకబడ్డ  కోల్కతా నైట్ రైడర్స్ కు  మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు, వేలంలో రూ. 7.25 కోట్లు పెట్టి దక్కించుకున్న ప్యాట్ కమిన్స్ కు గాయమైంది. 

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు సారథి, ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున  ఆడుతున్న ప్యాట్ కమిన్స్  సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి  దాదాపుగా తప్పుకున్న కేకేఆర్ కు ఇది షాకింగ్ న్యూసే. 

ప్లేఆఫ్ అవకాశాలు లేనప్పటికీ తర్వాత రెండు మ్యాచులలో అయినా విజయాలు సాధించి.. సీజన్ ను విజయాలతో ముగించాలని కేకేఆర్ భావిస్తున్నది. కానీ ఆ జట్టుకు మాత్రం కమిన్స్ లేకపోవడం పెద్ద దెబ్బే..

శ్రేయర్ అయ్యర్ సారథ్యంలోని కోల్కతా నైట్ రైడర్స్.. కమిన్స్ ను  ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 7.25 కోట్లు పెట్టి దక్కించుకుంది.  పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఏప్రిల్ అనంతరం (అప్పటికే కేకేఆర్  మూడు మ్యాచులు ఆడింది) ఐపీఎల్ కు వచ్చాడు. 

సీజన్  ప్రారంభంలో పలు మ్యాచులు ఆడిన  కమిన్స్ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో అతడిని పక్కనబెట్టి టిమ్ సౌథీని తుది జట్టులోకి తీసుకున్నారు.  ఇటీవలే ముంబై ఇండియన్స్ తో ముగిసిన మ్యాచ్ లో  కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 

ఈ సీజన్ లో మొత్తంగా 5 మ్యాచులాడిన కమిన్స్.. ఏడు వికెట్లు పడగొట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో భారీగా పరుగలిచ్చాడు. బ్యాటింగ్ లో 63 పరుగులు చేశాడు.  ఈ సీజన్ లో ముంబై తో జరిగిన తొలి మ్యాచ్ లో భారీ హిట్టింగ్ తో చెలరేగి  కేకేఆర్ కు అపూర్వ విజయాన్ని అందించాడు. 

కాగా.. కమిన్స్ కు గాయం కేకేఆర్ తో పాటు ఆస్ట్రేలియా జట్టుకు కూడా షాకింగ్ వంటిదే.  ఐపీఎల్ ముగిసిన తర్వాత  కంగారూలు.. శ్రీలంకతో మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడనున్నారు. మొదట టీ20,  ఆ తర్వాత వన్డేలు, చివర్లో టెస్టులు జరుగుతాయి. 

అయితే టీ20 సిరీస్ కు ఇప్పటికే ప్రకటించిన తుది జట్టులో  కమిన్స్ పేరు లేదు. అతడికి విశ్రాంతినిచ్చారు.  టీ20లలో విశ్రాంతినిచ్చినా  వన్డే సిరీస్ వరకు కమిన్స్ అందుబాటులోకి వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి. 

click me!