Aniket Verma
Aniket Verma : సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్న స్థాయిలో ఆడలేదు... లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిందనే చెప్పాలి. సొంత మైదానం ఉప్పల్ లో హైదరాబాద్ టీం తడబడింది... కానీ ఓ యువకెరటం మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడే అనికేత్ వర్మ. డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ క్రికెట్ ఆడిన ఈ యువకుడు ఐపిఎల్ లోనూ రెచ్చిపోతున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నవేళ అనికేత్ కేవలం 13 బంతుల్లో 36 పరుగులతో చిన్నసైజు సునామీ సృష్టించాడు.
లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ ను అనికేత్ ఓ ఆటాడుకున్నాడు. అతడి బౌలింగ్ లోనే మూడు భారీ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత దిగ్వేష్ ను రెండు సిక్సర్లు బాదాడు. ఇలా అనికేత్ సాధించిన 36 పరుగుల్లో 30 కేవలం సిక్సర్ల ద్వారా వచ్చినవే. ఇలా క్రీజులో ఉన్నంతసేపు ఆరెంజ్ ఆర్మీ అభిమానులను అలరించాడు అనికేత్.
Aniket Verma
ఎవరీ అనికేత్ :
సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లో చేరిన యువకెరటం ఈ అనికేత్. డొమెస్టిక్ క్రికెట్ లో మంచి హిట్టర్ గా గుర్తింపుపొందిన అనికేత్ వర్మ ఎస్ఆర్‌హెచ్ లో చేరడంలో మరింత బలం పెరిగింది. ఆరెంజ్ ఆర్మీ సొంత గ్రౌండ్ ఉప్పల్ లోనే అనికేత్ ఐపిఎల్ లో సత్తా చాటాడు. మొదటి మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఇతడు రెండో మ్యాచ్ లో మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన అనికేత్ మంచి ఆల్ రౌండర్. మంచి హిట్టర్ మాత్రమే కాదు రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ కూడా. అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసే ఇతడు టీ20 లకు సరిగ్గా సరిపోతాడు... మరీముఖ్యంగా ఐపిఎల్ లాంటి లీగ్స్ లో సత్తాచాటే దమ్మున్న ఆటగాడు. హిట్టర్లతో నిండిన హైదరాబాద్ టీంలో మరో హిట్టర్ చేరాడు.
డొమెస్టిక్ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున ఆడాడు అనికేత్. అండర్ 23 టోర్నమెంట్ లో అద్భుత సెంచరీతో ఇతడి ట్యాలెంట్ బైటపడింది. ఆ తర్వాత ఆలిండియా బుచ్చిబాబు టోర్నమెంట్ లో మరో సెంచరీ సాధించాడు. ఇలా అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టిన అనికేత్ ను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో అతడిని బరిలోకి దింపుతోంది... టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.