పంత్ అవసరం లేదు.. అతడుంటే భారత్‌కు ఆరో బౌలింగ్ ఆప్షన్ దొరుకుతుంది.. గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Dec 6, 2022, 5:50 PM IST

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను ఉన్నట్టుండి బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కు తప్పించింది టీమ్ మేనేజ్మెంట్.  వైద్యుల సూచన మేరకు  పంత్ ను తప్పించామని బీసీసీఐ చెబుతున్నా కారణాలు మాత్రం  బోర్డు దాచిపెడుతున్నదని   వాదనలు వినిపిస్తున్నాయి. 

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన తొలి వన్డేలో భారత జట్టు   రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను కాదని టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఆ బాధ్యతలను అప్పగించింది.  మ్యాచ్ కు ముందు బీసీసీఐ ట్విటర్ లో పంత్ ను వైద్యుల సూచన మేరకే పక్కనబెట్టామని చెప్పినా ఫామ్ లేమి కారణంగానే అతడిని  తప్పించినట్టు  గుసగుసలు వినిపిస్తున్నాయి. 

జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్ గా ఉన్న ఇషాన్ కిషన్ ను కూడా కాదని టీమ్ మేనేజ్మెంట్  కెఎల్ రాహుల్ నే వికెట్ కీపర్ గా కొనసాగించడం వెనుక  భారీ వ్యూహమే ఉందని.. వన్డే ప్రపంచకప్ వరకూ  ఇదే  కూర్పు కొనసాగుతుందనీ వార్తలు వస్తున్నాయి. వికెట్ కీపింగ్ కూడా చేయగల కెఎల్ రాహుల్..  ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తే అది భారత జట్టుకు మేలు చేస్తుందని  క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

అయితే తాజాగా ఇదే విషయమై  టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ప్రస్తుతానికి టీమిండియాకు పంత్ అవసరంలేదని.. రాహుల్ ఆల్ రౌండర్ అని కొనియాడాడు.  ప్రపంచకప్ వరకూ అతడినే కొనసాగిస్తే భారత్ కు ఆరో బౌలర్ ఆప్షన్ కూడా దొరుకుతుందని చెప్పాడు. 

బంగ్లాదేశ్ తో తొలి వన్డే తర్వాత  ఓ టీవీ ఛానెల్ తో సన్నీ మాట్లాడుతూ.. ‘టీమిండియాకు రోహిత్, ధావన్ లు ఓపెనర్లుగా ఉన్నారు.  కోహ్లీ మూడో స్థానంలో  బ్యాటింగ్ కు వస్తే  ఆ తర్వాత రాహుల్ ను పంపించొచ్చు. లేదా నాలుగో స్థానంలో  శ్రేయాస్ ను గానీ  సూర్యను గానీ  వాడుకుంటే ఐదో బ్యాటర్ గా అయినా రాహుల్ ను బరిలోకి దింపవచ్చు. 

అప్పుడు భారత్ కు ఫినిషర్ రోల్ కూడా పూర్తవుతుంది.  నా అభిప్రాయం మేరకైతే రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తేనే మంచిది. బహుశా రాహుల్ కూడా అదే కోరుకుని ఉంటుండవచ్చు. అలా చేస్తే  భారత్ కు  ఆరో బౌలర్ ను తీసుకునే అదనపు ఆప్షన్ దొరుకుతుంది.

మిడిలార్డర్ లో సమర్థవంతంగా బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడు ఉంటే.. అతడు వికెట్ కీపర్ కూడా అయితే అది జట్టుకు వరం లాంటిది.   రాహుల్ మంచి బ్యాటరే కాదు వికెట్ కీపింగ్ కూడా చేయగలడు కాబట్టి ఇతరుల కోసం వేచి చూడాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు...’ అని  పంత్ అవసరం లేదని చెప్పకనే చెప్పాడు. 
 

click me!