వన్డే సిరీస్ పోతే పోయింది.. టెస్టులైనా కాపాడుకోండి..! లేకుంటే మొదటికే మోసం..

First Published Dec 11, 2022, 6:51 PM IST

BANvsIND Tests: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా  ఆ జట్టు చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే.  తొలి రెండు వన్డేలలో ఓడిన భారత్ మూడో వన్డేలో గెలిచి పరువు దక్కించుకుంది.  మరో  మూడు రోజుల్లో  టెస్టు సిరీస్ మొదలుకానుంది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం కావడంతో ఈ  సిరీస్ కు కెఎల్  రాహుల్ సారథిగా వ్వవహరించనున్నాడు.

ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు అభిమానులను అత్యంత  ఆవేదనకు గురిచేసిన సిరీస్ బంగ్లాదేశ్ తో ముగిసిన  వన్డే సిరీసే అని చెప్పకతప్పదు. మూడు  వన్డేలలో బంగ్లాదేశ్ తొలి రెండు వన్డేలలో గెలిచి  సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ ఓటమి భారత్ ను భారీగా కుంగదీసింది.  

india bangladesh

అయితే వన్డే సిరీస్ పోయినా భారత్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు.   కానీ   త్వరలో ప్రారంభం కాబోయే టెస్టు సిరీస్ లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అయితే మాత్రం అది మొదటికే మోసం వస్తుంది. 

ఈనెల  14 నుంచి భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ఛత్తోగ్రామ్ వేదికగా మొదలుకానున్నది. డిసెంబర్ 22 నుంచి రెండో టెస్టు ఢాకా వేదికగా జరగాల్సి ఉంది. ఈ రెండు  టెస్టులలో ఏ ఒక్క మ్యాచ్ లో ఓడినా  భారత్ కు  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారీ షాక్ తప్పదు. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత్.. బంగ్లాదేశ్ తో రెండు టెస్టులూ గెలవాల్సిందే.  

ఇప్పటివరకు  భారత్ - బంగ్లాదేశ్ మధ్య  11 టెస్టులు జరిగాయి. ఈ 11 టెస్టులలో భారత్ 9 విజయాలు సాధించగా  రెండు మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి.  వన్డేలలో భారత్ కు అప్పుడప్పుడు షాకులిచ్చిన బంగ్లాదేశ్.. టెస్టులలో మాత్రం  ఆ సాహసం చేయలేకపోయింది. స్వదేశంలో భారత్.. బంగ్లాతో మూడు మ్యాచ్ లు ఆడింది. ఇందులో మూడింటింలోనూ విజయం టీమిండియాదే. 

ఇక బంగ్లా గడ్డ మీద భారత్.. 8 టెస్టులు ఆడింది. ఇందులో ఆరు మ్యాచ్ లలో టీమిండియా గెలవగా  రెండు మ్యాచ్ లు డ్రా అయ్యాయి. అయితే గతంతో పోలిస్తే బంగ్లాదేశ్ ఇప్పుడు మెరుగ్గా ఆడుతోంది.  అదీగాక వన్డే సిరీస్ లో గెలవడం ఇప్పుడు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. దీంతో భారత్ కు షాకివ్వడానికి బంగ్లా పులులు సిద్ధమవుతున్నాయి. 

india vs bangladesh

కానీ భారత్ కోణంలో ఈ రెండు టెస్టులు డ్రా చేసుకోవడం కాదు.. తప్పకుండా గెలిచితీరాలి. ఈ రెండు మ్యాచ్ లు గెలిస్తేనే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్  ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ సిరీస్ తర్వాత భారత్ కు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది.  ఈ సీజన్ (2021-23) లో  భారత్ కు మిగిలున్నవి ఈ ఆరు టెస్టులే.  

ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్  పాయింట్ల పట్టికలో.. 12 మ్యాచ్ లు ఆడిన భారత్ 6 విజయాలు,  నాలుగు పరాజయాలు, రెండు డ్రాలతో  75 పాయింట్లు సాధించి  52.08 శాతంతో ఉంది.  అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఉండగా.. తర్వాత సౌతాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి.  

బంగ్లాతో టెస్టు సిరీస్ ను 2-0తో గెలిస్తే భారత్  శ్రీలంకను అధిగమించే అవకాశం దక్కుతుంది. ఇక ఆస్ట్రేలియాను 4-0తో గానీ 3-0తో గానీ గెలిస్తే అప్పుడు భారత్ కు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.  అయితే ఈ క్రమంలో ఇతర జట్ల ఫలితాలు కూడా భారత్ ఫైనల్ చేరడంపై  ఆధారపడి ఉన్నాయి. 

click me!