బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా ఫెయిల్ - రోహిత్ శ‌ర్మ ఫైర్ - కార‌ణం ఏమిటంటే?

First Published | Nov 3, 2024, 4:37 PM IST

India vs New Zealand: న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు పూర్తిగా లొంగిపోయింది. మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 0-3 తేడాతో ఓడిపోయింది. దీనిపై రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 
 

Rohit Sharma

India vs New Zealand : భారత జట్టు తన సొంత గడ్డ‌పై ఘోరంగా ఓడిపోయింది. స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను 3-0తో కోల్పోయింది. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ విజిటింగ్ టీమ్ తన సొంత గడ్డపై టెస్టు సిరీస్‌లో భారత్‌ను వైట్‌వాష్ చేసింది.  147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా, భారత్ తన సొంత మైదానంలో 3 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ కావ‌డం ఇదే తొలిసారి.

Rohit Sharma Test

న్యూజిలాండ్‌తో జరిగిన ముంబై టెస్టులో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో న్యూజిలాండ్  భార‌త్ ను తన సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో ఓడిపోవడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్ర‌మంలోనే హిట్ మ్యాన్ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 

3-0తో వైట్‌వాష్‌ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫైర్ 

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత భార‌త జ‌ట్టు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. తాము మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేక‌పోయామ‌ని పేర్కొన్నాడు.  "అవును, మీకు తెలుసా సిరీస్ ఓడిపోవడం, టెస్టు ఓడిపోవడం ఎప్పుడూ సులభం కాదు, ఇది జీర్ణించుకోవడం కూడా అంత‌ సులభం కాదు. ఇక్క‌డ మేము మా అత్యుత్తమ క్రికెట్ ఆడలేదు, అది మాకు తెలుసు.. దీనిని మేము త‌ప్ప‌కుండా అంగీకరించాలి. వారు (న్యూజిలాండ్) మా కంటే మెరుగైన ప్రదర్శన చేశారు. మేము చాలా తప్పులు చేసాము.. వాటిని అంగీక‌రించాలి.. మ‌ళ్లీ వాటిని చేయ‌కుండా ప్ర‌ణాళిక‌లు చేసుకోవాల‌ని" రోహిత్ పేర్కొన్నాడు.


భార‌త్ ఓటమికి అతిపెద్ద కార‌ణం ఎవ‌రు? 

రోహిత్ శర్మ ఇంకా భార‌త జ‌ట్టు ఓట‌మి గురించి మాట్లాడుతూ "మేము మొదటి ఇన్నింగ్స్‌ - బెంగళూరు, పుణెలో తగినంత పరుగులు చేయలేకపోయాము. మేము ఆటలో వెనుకబడ్డాము. అయితే, ముంబైలో 
మాకు 28 పరుగుల ఆధిక్యం లభించింది.. అప్ప‌టివ‌ర‌కు మాదే పై చేయిగా ఉంది. అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించే దిశ‌గా ముందుకు సాగాము. కానీ మేము త‌ర్వాత మెరుగ్గా పని చేయాల్సిన స‌మ‌యంలో చేయ‌లేదు. స్కోర్ బోర్డు మీద మ‌రిన్ని ప‌రుగులు చేయాల్సింది. అలాగే, మేము గత 3-4 సంవత్సరాలుగా అలాంటి పిచ్‌లపై ఆడుతున్నాము, ఇక్కడ ఎలా ఆడాలో మాకు తెలుసు. కానీ ఈ సిరీస్‌లో మా ప్లాన్ సక్సెస్ కాకపోవడం బాధాకరం.. ఇదే మ‌మ్మ‌ల్ని దెబ్బ‌తీసిందని" తెలిపాడు. 

భార‌త బ్యాటింగ్ దెబ్బ‌కొట్టింది

రోహిత్ శర్మ కూడా తన బ్యాటింగ్ గురించి మాట్లాడాడు. భార‌త ఆట‌గాళ్లు ఇంకా మెరుగైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాల్సి ఉండాల్సింద‌ని పేర్కొన్నారు. 'ఇది నా మనసులో ఉన్న విషయం. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు నా మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఈ సిరీస్‌లో అది జరగకపోవడం నాకు నిరాశ కలిగించింది. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ మంచి బ్యాటింగ్ చేశారు' అని రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. 

ఇదే క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ‌ త‌న‌ను తాను తిట్టుకున్నాడు. "పంత్, గిల్ ఈ పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో చూపించారు. మిగ‌తా వారు కూడా మ‌రింత చురుగ్గా ఉంటూ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వాలి. అలాగే, బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా నేను అత్యుత్తమ ఫామ్‌లో లేను, ఇది నన్ను ఇబ్బంది పెట్టే విషయం. కానీ, సమిష్టిగా రాణించకపోవడమే ఈ సిరీస్ ఓటమికి ప్ర‌ధాన‌ కారణం" అని రోహిత్ శ‌ర్మ వెల్ల‌డించాడు.

రవీంద్ర జడేజా 10 వికెట్లు

ముంబై టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేసి 10 వికెట్లు పడగొట్టాడు. ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 65 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి 55 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా టెస్టుల్లో మూడోసారి 10 వికెట్లు తీశాడు.

దీంతో రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో మొత్తం 319 వికెట్లు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా 77 టెస్టు మ్యాచ్‌ల్లో 319 వికెట్లు పడగొట్టి 3230 పరుగులు చేశాడు.

Latest Videos

click me!