‘మెంటర్’ ధోనీ వచ్చేశాడు, సంబరాలు కానివ్వండి... ఘనంగా సీఎస్‌కే టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్...

First Published Nov 19, 2021, 4:14 PM IST

‘దేశానికి ఆడడం కంటే, ఐపీఎల్ ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు... ’ టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో భారత జట్టు పర్పామెన్స్ తర్వాత కపిల్ దేవ్ చేసిన కామెంట్లు ఇవి. వీటిని నిజం చేస్తూ, సీఎస్‌కే, ఐపీఎల్ 2021 టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌కి గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తోంది...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఘోరమైన ప్రదర్శనతో పరాభవాన్ని మూటకట్టుకుంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడి, గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది...

టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా, మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో అసలు ఏ మాత్రం ఆసక్తి లేనట్టుగా ఆడడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది...

భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఇదే. అయితే మాహీ లేకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఉద్దేశంతో ఆయన్ని బ్రతిమిలాడి మరీ టీమిండియాకి ‘మెంటర్’గా నియమించింది బీసీసీఐ...

మాహీ మహిమ నెగిటివ్‌లో పని చేస్తే, ప్రాక్టీస్ మ్యాచుల్లో అదరగొట్టిన భారత ప్లేయర్లు, అసలు మ్యాచులు మొదలయ్యాక తేలిపోయారు. దీంతో టీమిండియాతో పాటు మెంటర్ ధోనీపై కూడా ట్రోల్స్ వచ్చాయి...

అయితే దేశం పరువు తీసిన టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీతో తమకేమీ సంబంధం లేనట్టుగా ఐపీఎల్ 2021 టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌కి ఓ రేంజ్‌లో ఏర్పాట్లు చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్...

నవంబర్ 20న చెన్నైలోని కలైవార్ ఆరంగం ఆడిటోరియంలో సీఎస్‌కే టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు. 

వాస్తవానికి ఇప్పటికే ఈ సెలబ్రేషన్స్ ప్రారంభం కావాల్సింది కానీ సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మెంటర్‌గా టీమిండియాతో ఉండడంతో కాస్త ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి...

అదీకాకుండా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో వేలాది మంది అభిమానుల మధ్య సెలబ్రేషన్స్ నిర్వహిస్తామని ప్రకటించాడు సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్. అయితే టీ20 వరల్డ్‌కప్ ఎఫెక్ట్ కారణంగా స్టేడియం నుంచి ఆడిటోరియానికి సెలబ్రేషన్స్‌ని మార్చారు... 

సీఎస్‌కే సెలబ్రేషన్స్‌ నేపథ్యంలో మరోసారి ఎమ్మెస్ ధోనీపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మాహీ టీమిండియా ఆడినప్పుడు కంటే, ఐపీఎల్‌లో సీఎస్‌కేకి ఆడినప్పుడే దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు...

భారత జట్టు తరుపున సిక్సర్ కొట్టడానికి తెగ కష్టపడే, మాహీ ఐపీఎల్‌లో ఈజీగా బౌండరీల మోత మోగించేవాడు. ఇప్పుడు కూడా అలాగే టీమిండియా పరాభవంతో తనకేమీ సంబంధం లేనట్టు, ఐపీఎల్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌ చేసుకోవడం ఏంటని తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్‌ని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్, కెరీర్‌లో నాలుగో టైటిల్ సొంతం చేసుకుంది. గత ఏడాది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన సీఎస్‌కే, ఈ ఏడాది అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి టైటిల్ గెలవడం విశేషం.

click me!