అదే మా కొంప ముంచింది.. అందుకే ఫలితమిలా: విశాఖ ఓటమిపై రోహిత్ కామెంట్స్

First Published Mar 19, 2023, 9:49 PM IST

INDvsAUS: భారత్ - ఆస్ట్రేలియా మధ్య విశాఖపట్నం వేదికగా  ముగిసిన  రెండో వన్డేలో ఆసీస్ పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.  ఈ విజయంతో ఆసీస్.. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 1-1తో సమం  చేసింది. 

విశాఖపట్నం వేదికగా ఆదివారం ముగిసిన రెండో  వన్డేలో  ఆస్ట్రేలియా చేతిలో దారుణ పరాభవం పాలైన  భారత జట్టు  అవమానకర రీతిలో  ఓడింది.  మ్యాచ్ ఓడినా  పెద్దగా పట్టించుకోని అభిమానులు మరీ ఇంత దారుణంగా ఆడినందుకు ఫీల్ అవుతున్నారు. కొంతమందైతే సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఆటగాళ్ల మీద దుమ్మెత్తి పోస్తున్నారు.   

కాగా విశాఖ వన్డే ముగిశాక  టీమిండియా సారథి రోహిత్ శర్మ స్పందిస్తూ.. తమ ఓటమికి  బ్యాటింగే కారణమని    చెప్పాడు. ఈ పిచ్ మీద మరీ అంత తక్కువ స్కోరు చేయడం సమంజసం కాదని, తమ బ్యాటర్లు మరింత  బాగా ఆడితే బాగుండేదని అన్నాడు.  ఈ రోజు తమది కాదని.. మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పుకొచ్చాడు. 

రోహిత్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ఓడితే  చాలా బాధగా ఉంటుంది. మేం మొదట బ్యాటింగ్ చేసి సరిగ్గా ఆడలేకపోయాం.  ఈ పిచ్ మీద 117 పరుగులు  చేయడం చాలా తక్కువ.   ఇన్నింగ్స్ ఆదిలోనే శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయాం. తర్వాత  నేను, కోహ్లీ కొన్ని పరుగులు చేశాక  వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బతీసింది. 

మ్యాచ్ లో అదే మమ్మల్ని వెనుకడుగు వేసేలా చేసింది. ఆ పరిస్థితుల నుంచి మేం తిరిగి కోల్పోలేకపోయాం.  ఈ రోజు పూర్తిగా మాకు కలిసిరాలేదు...’అని చెప్పాడు. కాగా నేటి మ్యాచ్ లో గిల్ డకౌట్ అయిన వెంటనే కోహ్లీ - రోహిత్ లు కలిసి రెండో వికెట్ కు 29 పరుగులు జోడించారు.  కుదురుకుంటున్న భారత్ ను  స్టార్క్ దెబ్బతీశాడు. 

కాగా ఇదే మ్యాచ్ లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్  చేశాడని రోహిత్ చెప్పాడు. కొత్త బంతితో  స్టార్క్ అద్భుతాలు సృష్టిస్తాడని,  స్వింగ్ తో అతడు తమను బాగా ఇబ్బందిపెట్టాడని  తెలిపాడు.  ఇక ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్స్ అద్భుతమైన పవర్ హిట్టర్ అని,  అతడు  నేడు చాలా బాగా ఆడాడని చెప్పుకొచ్చాడు. 

మ్యాచ్ ను 37 ఓవర్లలోనే ముగించడం  తమకు సంతోషంగా ఉందని..  ఇంత త్వరగా ముగుస్తుందని తాము కూడా ఊహించలేదని ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ తెలిపాడు.  కొత్త బంతితో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని,   ఛేదనలో  ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ లు బాగా బ్యాటింగ్ చేశారని స్మిత్ కొనియాడాడు.   భారత్ పై  విజయంతో ఆసీస్.. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 1-1 తో సమం చేసింది. మూడో  వన్డే ఈనెల 22న  చెన్నై వేదికగా జరుగనుంది. 
 

click me!