క్రికెట్ మాస్టర్ మైండ్‌తో బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ధోనికి కీలక బాధ్యతలు.. ఆ లోటు తీర్చేందుకు కొత్త వ్యూహం

First Published Nov 15, 2022, 5:26 PM IST

MS Dhoni: వరుసగా ఐసీసీ టోర్నీలలో విఫలమవుతూ  ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశపరుస్తున్న  భారత క్రికెట్ జట్టు రాత  మార్చేందుకు  బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది.  ఐసీసీ టోర్నీలలో  మెరిసేందుకు గాను ఆ ట్రోఫీలు అలవోకగా సాధించిన జార్ఖండ్ డైనమైట్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పనుంది. 
 

గత దశాబ్దంలో భారత క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా మారాడు జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని.  2007లో  ఐసీసీ తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచకప్ ను నెగ్గిన ధోని.. ఆ  తర్వాత 2011 వన్డే ప్రపంచకప్, 2013  లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కు అందించాడు.  ధోని సారథ్యంలో భారత్ స్వర్ణ యుగాన్ని చూసింది. 

అయితే ధోని నిష్క్రమణ  తర్వాత ఈ టోర్నీలలో భారత వైఫల్యం దారుణంగా కొనసాగుతోంది.   2014 నుంచి ఇప్పటివరకూ ఆడిన ప్రతీ ఐసీసీ టోర్నీలో టీమిండియా విఫలమవుతూనే ఉన్నది. కెప్టెన్లు మారినా భారత జట్టు తలరాత మాత్రం మారడం లేదు. 

Latest Videos


ద్వైపాక్షిక సిరీస్  లు, విదేశాలలో రాణించిన భారత జట్టు విరాట్ కోహ్లీ సారథ్యంలో ‘దూకుడు’ను ఒంటబట్టించుకుంది.  అయితే ఈ దూకుడుమంత్రం   భారత్ కు ఒక్క ఐసీసీ టోర్నీ  కూడా తీసుకురాలేదు. ఇదే కారణంగా అతడిని తప్పించిన బీసీసీఐ.. గతేడాది రోహిత్ శర్మకు ఆ బాధ్యతలను అప్పగించింది.  అయినా ఫలితం మాత్రం మారలేదు.ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. 

ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ధోనిని జట్టుతో కలిపి  టీ20  స్పెషలిస్టులను తయారుచేసే పనిని మహేంద్రుడికి అప్పజెప్పనున్నట్టు సమాచారం. ఇలా చేస్తే ద్రావిడ్ మీద కూడా  పనిభారం తగ్గుతుందని.. తద్వారా ఫలితాలు మెరుగవుతాయని   బీసీసీఐ భావిస్తున్నది. 

టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ఈనెల ఆఖర్లో గానీ డిసెంబర్ మొదటివారంలో గానీ జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై  బీసీసీఐ పెద్దలు కీలక చర్చ జరపనున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఫార్మాట్ కు ఓ జట్టు ప్రకారం  అన్నిదేశాలు దూసుకుపోతుంటే టీమిండియా మాత్రం  మూడు ఫార్మాట్లకూ దాదాపు ఒకే జట్టును  కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో టీ20లకూ  ప్రత్యేక కోచ్ ఉండాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ధోనికి అవే బాధ్యతలను అప్పజెప్పేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. 

ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ధోని.. లీగ్ నుంచి నిష్క్రమించనున్నట్టు తెలుస్తున్నది.  దీంతో అతడి అనుభవాన్ని  భారత క్రికెట్ లో ఉపయోగించుకోవాలని   బీసీసీఐ భావిస్తున్నది.  ధోని ఇదివరకే భారత జట్టుతో కలిసి 2021 టీ20 ప్రపంచకప్ లో  మెంటార్ గా కలిసి పనిచేశాడు.

 కానీ అప్పుడు  అంతా తక్కువ వ్యవధిలోనే జరిగిపోయింది. దీంతో ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఈసారిమాత్రం  అలా జరుగకుండా  దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తేనే ఫలితాలు సాధ్యమని  బీసీసీఐ బాసులు భావిస్తున్నారు.

click me!