ఫార్మాట్‌కు ఓ జట్టు.. ఆ టీమ్‌ల సక్సెస్ మంత్ర అదే.. అలా అయితే నెగ్గుకురాగలం..!

First Published Nov 15, 2022, 12:05 PM IST

టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ నుంచి వైదొలిగిన తర్వాత జట్టులో మార్పులు చేయాలని  సూచనలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లందరినీ తప్పించి తద్వారా కొత్తరక్తాన్ని జట్టులోకి ఎక్కించాలని  నిపుణులు సూచిస్తున్నారు. 
 

ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో  లీగ్ దశల్లో అదరగొట్టి సెమీస్ లో ఇంగ్లాండ్  చేతిలో దారుణంగా ఓడిన భారత జట్టుపై విమర్శలు చేసిన మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు, క్రీడా పండితులు తాజాగా జట్టులో మార్పులు చేర్పుల గురించి విశ్లేషిస్తున్నారు. 

భారత ఓటమి తర్వాత చాలామంది నోటినుంచి వినిపించిన మాట జట్టులో మార్పులు చేయడం..ముఖ్యంగా  చాలా మంది సీనియర్లు ఇక టీ20 ఫార్మాట్ కు పనికిరారని.. వారి స్థానంలో యువ ఆటగాళ్లను తీసుకొచ్చి   కొత్తరక్తంతో జట్టును నడిపించాలని అభిప్రాయపడుతున్నారు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా భారత్ సెమీస్ ఓడిన వెంటనే ఈ ప్రతిపాదన చేశాడు.

ఇదే విషయమై తాజాగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా స్పందించాడు. టీమిండియా కూడా మూడు ఫార్మాట్లకు మూడు జట్లతో ఆడితే మంచిదని, అలా లేకుంటే  టీ20 లలో నెగ్గుకురావడం చాలా కష్టమని అన్నాడు. టీ20లలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయని, అలా చేసే  సక్సెస్ సాధించాయని తెలిపాడు. 

కుంబ్లే మాట్లాడుతూ.. ‘అవును. మూడు ఫార్మాట్లకు మూడు జట్లు ఉండాలి. మరీ ముఖ్యంగా టీ20లలో ఆ అవసరం  ఎంతైనా ఉంది.  టీ20 ఆడేందుకు స్పెషలిస్టులు కావాలి.  ప్రస్తుతం ఇంగ్లాండ్, 2021లో ఆస్ట్రేలియా ఇదే ఫార్ములాతో ముందుకెళ్లాయి. అందుకే ఆ  జట్లు సక్సెస్ అయ్యాయి. 

ఈ ఫార్మాట్  ఆల్ రౌండర్ల అవసరం ఎంతో ఉంది. మీరు ఇంగ్లాండ్ జట్టును చూడండి.. లియామ్ లివింగ్  స్టోన్ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు  వస్తున్నాడు. ఆస్ట్రేలియాలో మార్కస్ స్టోయినిస్ వంటి ప్లేయర్ ఆరోస్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడంటే వాళ్ల బ్యాటింగ్ లోతు ఎంత డీప్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్లో హిట్టర్లు, ఆల్ రౌండర్లే చాలా కీలకం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు అలాంటి ఆటగాళ్లనే తయారుచేసుకున్నాయి..’ అని అన్నాడు. 

ఇంగ్లాండ్ కు టెస్టులు, వన్డేలు, టీ20లకు ప్రత్యేక టీమ్ లు ఉన్నాయి. టెస్టులలో ఇంగ్లాండ్ కు  బెన్ స్టోక్స్ కెప్టెన్ కాగా కోచ్ గా బ్రెండన్ మెక్ కల్లమ్ లు ఉన్నారు. వన్డే, టీ20లకు జోస్ బట్లర్ సారథి కాగా మాథ్యూ మాట్ హెడ్ కోచ్ గా ఉన్నాడు.

 ఆస్ట్రేలియా జట్టుకు హెడ్ కోచ్ లు మారకున్నా.. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్ కు ప్రత్యేక జట్లు, సారథులూ ఉన్నారు. టీమిండియా కూడా ఆ విధమైన ఫార్ములాను పాటించాలని, ఫార్మాట్ కు సరిపోయే ఆటగాళ్లను ఎంపిక చేసుకుని జట్లను తయారుచేసుకోవాలని సూచించాడు. 

click me!