నేనిప్పుడే మళ్లీ మొదలెట్టా.. నా టీ20 ఆటేందో చూపిస్తా : విరాట్ కోహ్లీ

First Published May 22, 2023, 3:03 PM IST

Virat Kohli:  ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీతో శివాలెత్తాడు. గుజరాత్ పై శతకం బాది బ్యాక్ టు బ్యాక్  హండ్రెడ్స్ తో   కొత్త రికార్డులు సృష్టించాడు. 

ఐపీఎల్ లో ఏడో సెంచరీ చేసిన  ఆర్సీబీ సూపర్  స్టార్ విరాట్ కోహ్లీ.. సరికొత్త రికార్డులు  సృష్టించాడు.  గుజరాత్ టైటాన్స్ ఆదివారం  రాత్రి బెంగళూరు వేదికగా  ముగిసిన  మ్యాచ్ లో  కోహ్లీ   సెంచరీతో చెలరేగిన విషయం  తెలిసిందే. ఐపీఎల్  లో కోహ్లీకి ఇది ఏడో సెంచరీ.  

అయితే  గత సీజన్ తో పోలిస్తే  2023లో   మెరుగ్గా ఆడుతున్నా  కోహ్లీ  హాఫ్ సెంచరీలు, ఆరెంజ్ క్యాప్ కోసమే ఆడుతున్నాడని, అతడి స్ట్రైక్ రేట్  చూస్తే ఇది అర్థమవుతుందని  విమర్శకులు కోహ్లీపై  విమర్శలు గుప్పిస్తున్నారు.   ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సైమన్ డౌల్ అయితే  బహిరంగంగానే  కోహ్లీ స్ట్రైక్ రేట్ పై విరుచుకుపడ్డాడు. 

కాగా  గుజరాత్  టైటాన్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.  తన టీ20 ఆటేమీ  తగ్గలేదని..   తానిప్పుడే మళ్లీ ఈ ఫార్మాట్ లో    అత్యుత్తమంగా ఆడేందుకు యత్నిస్తున్నాని, ఇకనుంచి కూడా ఇదే కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు.  

Image credit: PTI

గుజరాత్ తో మ్యాచ్ తర్వాత పోస్ట్  మ్యాచ్ ప్రజెంటేషన్ లో కోహ్లీ మాట్లాడుతూ..  ‘బయట చాలా మంది నా టీ20  ఆట, స్ట్రైక్ రేట్ గురించి చాలా మాట్లాడుతున్నారు.   కానీ నా ఆటపై  నాకెప్పుడూ ఎలాంటి అసంతృప్తీ  లేదు.  ఇప్పుడు నేను ఈ ఫార్మాట్ లో అత్యుత్తమంగా ఆడుతున్నాను. నా ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నా.   

నేను  టీ 20 క్రికెట్ ను ఇలాగే ఆడతా.   పరిస్థితులు నాకు అనుకూలంగా ఉంటే   నేను గ్యాప్స్  మధ్య బౌండరీలు బాదుతా.  ఇక స్ట్రైక్  రేట్, త్వరగా పరుగులు చేయడం లేదన్న  విమర్శలు నేనూ విన్నా.  అయితే నేను గతంలోనే చెప్పినట్టు.. పరిస్థితులకు అనుకూలంగా ఆడాలి.  అలా ఆడుతున్నందుకు నేను గర్వపడుతున్నా .  ప్రస్తుతానికైతే నా ఆట పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నా..’ అని  చెప్పాడు.  

ఈ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ..  56.67 సగటు, 139.87 స్ట్రైక్ రేట్ తో  680  పరుగులు చేశాడు. ఇందులో   రెండు సెంచరీలు, ఆరు అర్థ  సెంచరీలు ఉన్నాయి.   ఐపీఎల్ - 16 లో లీగ్ దశ పోటీలు ముగిసేసరికి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డుప్లెసిస్  (730), శుభ్‌మన్ గిల్  (680) తర్వాత కోహ్లీ  (639)  మూడో స్థానంలో ఉన్నాడు. 

click me!