Shivam Dube
Shivam Dube explosive knock: ఫామ్ తో ఇబ్బంది పడుతూ కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన యంగ్ ప్లేయర్ శివమ్ దూబే.. ఫామ్ ను అందిపుచ్చుకుంటూ తన బ్యాట్ పవర్ ను చూపించాడు. సిక్సర్ల వర్షం కూరిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 191కి పైగా స్ట్రైక్ రేట్ తో 7 సిక్సర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడుతున్న శివమ్ దూబే సంచలన బ్యాటింగ్ తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2025కి ముందు అభిమానులను, సెలెక్టర్లను ఆశ్చర్యపరిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రాబోయే సీజన్ లో శివమ్ దూబే శివాలెత్తే ఇన్నింగ్స్ చూడవచ్చని హెచ్చరికలు పంపాడు.
ఆల్-రౌండర్ కేవలం 37 బంతుల్లో ఏడు అద్భుతమైన సిక్సర్లు, రెండు బౌండరీలతో అజేయంగా 71 పరుగులు చేశాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో దూబే ధనాధన్ ఇన్నింగ్స్ తో ముంబై జట్టు 192/4 స్కోర్ చేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సర్వీసెస్, ముంబై స్టార్ ఓపెనర్ పృథ్వీ షాను డకౌట్ చేయడం ద్వారా మొదట్లో ప్రయోజనం పొందింది. ముంబై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 14 బంతుల్లో వేగంగా 20 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆటను మలుపు తిప్పారు. ముంబై 36/2 వద్ద ఉన్న సమయంలో వీరు క్రీజులోకి వచ్చి తుఫాను ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ కేవలం 66 బంతుల్లోనే నాలుగో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ 46 బంతుల్లో 70 పరుగులు చేసి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఆఖరి ఓవర్‌లో ఔటయ్యే ముందు అతని నాక్‌లో ఏడు బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
ముంబై మొత్తం 192/4 పరుగులతో సర్వీసెస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సర్వీసెస్ టీమ్ 19.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. షామ్స్ ములానీ 3, దూబే, మోహిత్ అవస్తి చెరో 1 పరుగు తీశారు.
ముంబై ఇప్పటి వరకు 5 క్రికెట్ మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించింది , టోర్నమెంట్ గ్రూప్ E లో రెండవ స్థానానికి చేరుకుంది. ఇతర టేబుల్ టాపర్లు, ఆంధ్రప్రదేశ్ (4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కేరళ (5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) కూడా 16 పాయింట్లను కలిగి ఉన్నాయి.