IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో తనను ఎవరూ కోనుగోలు చేయలేదనే ప్రతాపమో ఏమో గాని గుజరాత్ టైటాన్స్ మాజీ ప్లేయర్ సెంచరీల మోత మోగిస్తున్నారు. ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత అరేరే ఎందుకు అతన్ని తీసుకోలేకపోయామని ఐపీఎల్ ప్రాంఛైజీలు అనుకునే విధంగా వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. అతనే ఉర్విల్ పటేల్.
గుజరాత్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2024లో అతని బ్యాట్ గర్జనలకు బౌలర్లు భయపడిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం 28 బంతుల్లోనే సెంచరీతో రికార్డుల మోత మోగించారు. మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ను ఆడాడు. మంగళవారం ఉత్తరాఖండ్‌పై ఉర్విల్ పటేల్ కేవలం 36 బంతుల్లో సెంచరీ సాధించాడు.
గుజరాత్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన ఉర్విల్ పటేట్.. తన ఇన్నింగ్స్ లో 11 సిక్స్‌లు, 8 ఫోర్లతో అజేయంగా 41 బంతుల్లో 115 పరుగులు చేశాడు. ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు, 35 బంతులు మిగిలి ఉండగానే అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ఈ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ 20 ఓవర్లలో 182/7 స్కోరు చేసింది.
Urvil Patel
ఉర్విల్ పటేల్ టీ20 క్రికెట్ లో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డును కలిగి ఉన్నాడు, అయితే ఉత్తరాఖండ్‌పై 36 బంతుల్లో అతని సెంచరీ భారతీయ బ్యాట్స్‌మెన్ చేసిన నాల్గవ వేగవంతమైన సెంచరీగా నిలిచింది. రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. SMAT 2018లో హిమాచల్ ప్రదేశ్‌పై పంత్ 30 బంతుల్లో సెంచరీ సాధించగా, 2017లో శ్రీలంకపై రోహిత్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
Urvil Patel
ఉర్విల్ పటేల్ ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాతి రోజు అద్భుతమైన ఇన్నింగ్స్ తో కేవలం 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. నవంబర్ 27న గుజరాత్, త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఉర్విల్ చేసిన ఈ సెంచరీ టీ-20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
టీ20లో వేగవంతమైన సెంచరీ
1. సాహిల్ చౌహాన్ (ఈస్టోనియా) – సైప్రస్‌పై 27 బంతుల్లో (2024)
2. ఉర్విల్ పటేల్ (గుజరాత్) – త్రిపురపై 28 బంతులు (2024)
3. క్రిస్ గేల్ (RCB) – 30 బంతుల్లో పుణె వారియర్స్‌పై (2013)
4. రిషబ్ పంత్ (ఢిల్లీ) – 32 బంతుల్లో హిమాచల్ పై (2018)
5. విహాన్ లుబ్బే (నార్త్-వెస్ట్) – లింపోపోపై 33 బంతులు (2018)
26 ఏళ్ల ఉర్విల్ పటేల్ ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొన్నాడు. అయితే అతడిని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. మెహ్సానా (బరోడా) నివాసి అయిన ఉర్విల్ పటేల్ 2018లో రాజ్‌కోట్‌లో ముంబైతో జరిగిన టీ20 మ్యాచ్‌లో బరోడా తరఫున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో అతను లిస్ట్-ఎ క్రికెట్‌లోకి కూడా ప్రవేశించాడు. కానీ అతను రంజీ ట్రోఫీ చివరి ఎడిషన్‌లో అరంగేట్రం చేయడానికి ముందు అతనికి ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటానికి ఆరు సంవత్సరాలు పట్టింది. గుజరాత్ టైటాన్స్ 2023 సీజన్‌కు ఉర్విల్‌ను రూ. 20 లక్షల ధరతో కొనుగోలు చేసింది, అయితే అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.