
2025లో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన 7వ భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ విజయం సాధించిన భారత కెప్టన్లు ఇప్పటి వరకు ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే పలు టెస్ట్ మ్యాచ్‌లు గెలుపొందారు.
భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఇప్పటి వరకు 60 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 9 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఇందులో ఎక్కువగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే వచ్చాయి. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఇంగ్లండ్‌లో మూడు విజయాలు సాధించింది. ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచ్ లను గెలిచిన భారత కెప్టెన్ల వివరాలు ఇలా ఉన్నాయి..
విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ గడ్డపై 10 టెస్ట్‌ల్లో భారత జట్టును నాయకత్వం వహించాడు. ఇందులో భారత్ 3 విజయాలు సాధించింది. 2018లో ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద, 2021లో లార్డ్స్, ఓవల్‌లో కోహ్లీ నేతృత్వంలో భారత్ గెలుపొందింది. 2021 సిరీస్‌లో 2-1గా ఆధిక్యంలో ఉండగా కరోనా కారణంగా ఐదో మ్యాచ్ రద్దైంది. ఆ తర్వాత ఐదో టెస్ట్ 2022లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో ఆడిన భారత జట్టు ఓడిపోయింది.
కాగా, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచారు. 2014 నుంచి 2022 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించిన కోహ్లీ, మొత్తం 68 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 40 విజయాలు సాధించారు. ఈ గణాంకాలతో అతను భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అగ్రస్థానంలో ఉన్నాడు.
కోహ్లీ కెప్టెన్సీ గణాంకాలు గమనిస్తే.. మొత్తం ఆడిన మ్యాచ్ లు 68 ఉండగా, అందులో 40 విజయాలు అందించాడు. 17 మ్యాచ్ లు ఓడిపోగా, 11 మ్యచ్ లు డ్రాగా ముగిశాయి. టెస్ట్ కెప్టెన్‌గా కోహ్లీ బ్యాటింగ్ సగటు 54.80 గా ఉంది. కెప్టెన్‌గా 5864 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 254* పరుగులను పుణేలో 2019లో సౌతాఫ్రికాపై సాధించాడు.
1983 ఐసీసీ వరల్డ్ కప్ విజేత అయిన కపిల్ దేవ్.. 1986లో ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలిచిన రెండవ భారత కెప్టెన్ గా నిలిచాడు. 3 మ్యాచుల సిరీస్‌లో 2-0తో భారత్ విజయం సాధించింది. లార్డ్స్, హెడింగ్లీ స్టేడియాల్లో జరిగిన ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాల్లో ఒకటి. కపిల్ దేవ్ ఇంగ్లండ్‌లో టెస్ట్ కెప్టెన్సీ ఈ సిరీస్ వరకు మాత్రమే చేశాడు.
మొత్తంగా కపిల్ దేవ్ టెస్ట్ కెరీర్ ను గమనిస్తే.. 131 టెస్టు మ్యాచ్ లలో 184 ఇన్నింగ్స్ లలో 5248 పరుగులు చేశాడు. ఇందులో కపిల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 163 పరుగులు. టెస్టు క్రికెట్ లో కపిల్ దేవ్ స్ట్రైక్ రేటు 94.77 కాగా, బ్యాటింగ్ సగటు 31.05 శాతంగా ఉంది. టెస్టు క్రికెట్ లో కపిల్ దేవ్ 8 సెంచరీలు, 27 హాఫ్ సంచరీలు సాధించాడు. ఒకే టెస్ట్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్లు తీసిన అరుదైన ఆల్‌రౌండర్లలో కపిల్ దేవ్ ఒకరు.
1971లో అజిత్ వడేకర్ భారత జట్టును ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్, మ్యాచ్ గెలిపించిన తొలి కెప్టెన్. ది ఓవల్ టెస్ట్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుచుకుని 1-0తో సిరీస్‌ను కూడా గెలిచారు. 1974లో వడేకర్ నేతృత్వంలో జరిగిన మరో సిరీస్‌లో భారత్ 3-0తో ఓడిపోయింది.
భారత్‌కు మూడు అంతర్జాతీయ సిరీస్‌లు గెలిపించిన తొలి కెప్టెన్ అజిత్ వడేకర్. అజిత్ వడేకర్ 1971లో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వర్ణయుగం ప్రారంభించిన నాయకుడు. ఆయన నాయకత్వంలోనే భారత్ వెస్టిండీస్‌లో టెస్ట్ సిరీస్ (1971), ఇంగ్లాండ్‌లో తొలి టెస్ట్ సిరీస్ (1971), ఇంగ్లాండ్‌ను భారత్‌లో ఓడించిన సిరీస్ (1972–73) లను గెలిపించాడు. 1971లో అతని కెప్టెన్సీలోనే భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 1990లలో ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ సమయంలో భారత జట్టు మేనేజర్‌గా పనిచేశారు. భారత జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా సేవలందించారు.
2014లో లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఎం.ఎస్. ధోనీ నేతృత్వంలో భారత్ గెలుపొందింది. 9 టెస్టుల్లో కేవలం ఒక విజయం సాధించిన ధోనీ నేతృత్వంలో భారత జట్టు ఆ సిరీస్‌ను 3-1తో ఓడింది. 2011లో భారత్ 4-0తో వైట్‌వాష్ అయింది.
ధోని కెప్టెన్సీలో భారత జట్టు మొత్తం 60 టెస్టు మ్యాచ్ లను ఆడింది. ఇందులో 27 విజయాలు, 18 ఓటములు ఉన్నాయి. మరో 15 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఈ విజయాల్లో 21 హోంగ్రౌండ్ లో సాధించినవి ఉన్నాయి. అయితే, ధోని కెప్టెన్సీలోనే భారత జట్టు ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.
2002లో హెడింగ్లీ టెస్ట్‌లో సౌరవ్ గాంగూలీ నేతృత్వంలో భారత్ గెలుపొందింది. ఇది 16 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్‌లో భారత జట్టు టెస్ట్ విజయంగా నిలిచింది. ఆ సిరీస్ 1-1 డ్రాతో ముగిసింది. గాంగూలీ ఇంగ్లాండ్‌లో ఆడిన నాలుగు టెస్ట్‌లకే మాత్రమే కెప్టెన్‌గా ఉన్నారు.
సౌరవ్ గంగూలీ టెస్టు క్రికెట్ కెరీర్ గమనిస్తే.. తన కెప్టెన్సీలో భారత జట్టు 49 మ్యాచ్ లను ఆడింది. అందులో 21 విజయాలు, 13 ఓటములు, 15 డ్రా మ్యాచ్ లు ఉన్నాయి. గంగూలీ భారతదేశ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి 20 టెస్ట్ విజయాలు సాధించిన కెప్టెన్ గా నిలిచాడు.
2007లో రాహుల్ ద్రావిడ్ భారత జట్టును ఇంగ్లాండ్‌లో జరిగిన మూడు మ్యాచుల సిరీస్ 1-0తో గెలిపించాడు. నాటింగ్‌హామ్ టెస్ట్‌లో భారత్ విజయం సాధించింది. అదే ద్రావిడ్ కెప్టెన్సీ కింద భారత జట్టు ఇంగ్లండ్‌లో గెలిచిన చివరి టెస్ట్ సిరీస్. లార్డ్స్, ఓవల్ టెస్ట్‌లు డ్రా అయ్యాయి. ఈ విజయం తర్వాత భారత్ 14 సంవత్సరాలపాటు ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలవలేదు.
రాహుల్ ద్రావిడ్ తన టెస్టు కెరీర్ లో 164 మ్యాచ్ లలో 286 ఇన్నింగ్స్ లను ఆడి 13288 పరుగులు చేశారు. టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 270 పరుగులు. సుదీర్ఘ ఫార్మాట్ లో ద్రవిడ్ 5 డబుల్ సెంచరీలు, 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించాడు.
2025లో మొదటి సారి టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న శుభ్ మన్ గిల్ తన మొదటి టూర్ ను ఇంగ్లాండ్ సిరీస్ తో ప్రారంభించనున్నాడు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచే ఏడవ భారత కెప్టెన్ కావాలనే టార్గెట్ ఈ టూర్ కు వెళ్లాడు. గిల్ ఏం చేస్తాడో చూడాలి మరి !