1. జస్ప్రీత్ బుమ్రా
అద్భుతమైన బౌలింగ్ తో జస్ప్రీత్ బుమ్రా నేడు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ గా కొనసాడుతున్నాడు. భారత్ కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు. టీమ్ మొత్తం విఫలమైన సమయంలోనూ తనదైన ప్రదర్శనతో సత్తా చాటిన ఈ స్టార్ పేసర్ ప్రస్తుతం నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు.
సాధారణ కుటుంబ నేపథ్యంలో కలిగిన బుమ్రా కెరీర్ ప్రారంభంలో చాలానే ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే, ప్రస్తుతం కోట్ల రూపాయలు సంపాధించాడు. ఈ బౌలర్ ప్రస్తుతం 62 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నాడు. బుమ్రా బాల్యం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. టీ షర్ట్, షూస్ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి అతనికి ఎదురైంది. నేడు తన కృషితో కోట్లకు అధిపతి అయ్యాడు.
2. మహ్మద్ సిరాజ్
మహ్మద్ సిరాజ్ తక్కువ కాలంలోనే భారత జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. పలు మీడియా నివేదికల ప్రకారం.. ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రస్తుతం 57 కోట్ల రూపాయల ఆస్తిని కలిగివున్నాడు. అయితే, ఒకప్పుడు అతని తండ్రి జీవనోపాధి కోసం రిక్షా నడిపేవారు. తన కొడుకు క్రికెటర్ కావాలనే కోరికతో తన సర్వస్వాన్ని పణంగా పెట్టారు. నేడు తన కష్టంతో తండ్రితో పాటు దేశానికి కీర్తి తెచ్చాడు. భారత క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
3. టీ నటరాజన్
టీ నటరాజన్‌కు జట్టులో చోటు దక్కినా, ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయాడు. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), దేశవాళీ క్రికెట్, ఇతర టోర్నమెంట్ల ద్వారా మంచి ఆదాయం పొందుతున్నాడు. నివేదికల ప్రకారం, ఈ ఆటగాడి వద్ద ప్రస్తుతం 14 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అయితే, ఒకప్పుడు నటరాజన్ కుటుంబం కడు పేదరికంలో ఉండేది. మొత్తం వారి కుటుంబంలో ఐదుగురు పిల్లలు ఉండగా.. వారిని పోషించడానికి నటరాజన్ తండ్రి చాలా కష్టపడ్డారు. ఒకానొక సమయంలో తినడానికి కూడా తిండిలేని పరిస్థితుల నుంచి నేడు క్రికెట్ లో అద్భుతమైన ఆటతో కోట్ల రూపాయలు సంపాదించారు.
4. రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్లేయర్. టీ20, వన్డే, టెస్టు క్రికెట్ ఇలా మూడు ఫార్మాట్లలో సత్తా చాటిన స్టార్ క్రికెటర్. చాలా సార్లు భారత్ కు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో సూపర్ విక్టరీలు అందించిన ఆటగాడు. కోట్ల రూపాయల విలువైన బంగ్లా, ఖరీదైన అభిరుచులు కలిగి ఉన్నాడు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఈ ఆటగాడి వద్ద 120 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అయితే, ఒకప్పుడు జడేజా తండ్రి గార్డుగా, తల్లి నర్సుగా పనిచేసేవారు. తన కృషి, ప్రతిభతో నేడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు.
5. హార్దిక్-కృనాల్ పాండ్యా
హార్దిక్ పాండ్యా భారత జట్టులో కీలక ఆల్‌రౌండర్. అతని సోదరుడు కృనాల్ కూడా భారత జట్టుకు ఆడాడు. పలు మీడియా నివేదికల ప్రకారం.. హార్దిక్ పాండ్యా వద్ద 92 కోట్ల రూపాయల ఆస్తి ఉండగా, అతని సోదరుడి వద్ద 60 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అయితే, ఇద్దరికీ ఒకప్పుడు తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. నేడు కోట్లకు అధిపతులు.. దేశంలో టాప్ సెలబ్రిటీలుగా భారీగా ఆదాయం సంపాదిస్తున్నారు.