Image Credit: Getty Images
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఆరోపించాడు. ఇంగ్లాండ్ సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం కోల్‌కతాకు బయలుదేరే ముందు శర్మ తన కుటుంబంతో సమయం గడపడానికి పంజాబ్‌కు వెళ్తున్న సమయంలో ఇది జరిగింది. జనవరి 22 నుంచి ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తో తొలి మ్యాచ్ జరగనుంది.
Image Credit: InstagramAbhishek Sharma
అభిషేక్ శర్మ ఏం చెప్పాడంటే?
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ లో తనకు జరిగిన సంఘటనను పంచుకుంటూ.. చెక్-ఇన్ కౌంటర్‌లో ఎయిర్‌లైన్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నాడు. ఇండిగోతో తనకు చెత్త విమాన అనుభవం ఎదురైందని పేర్కొన్నాడు. అనవసరంగా తనను ఒక కౌంటర్ నుండి మరో కౌంటర్‌కి దారి మళ్లించడం వల్ల తన ఇంటికి వెళ్లడానికి ఫ్లైట్ మిస్ అయ్యానని తెలిపాడు.
"ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగోతో నాకు చెత్త అనుభవం ఎదురైంది. సిబ్బంది, ముఖ్యంగా కౌంటర్ మేనేజర్ శ్రీమతి సుస్మితా మిట్టల్ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. నేను సరైన కౌంటర్‌కు సమయానికి చేరుకున్నాను, కాని వారు నన్ను అనవసరంగా మరొక కౌంటర్‌కు వెళ్లమన్నారు. ఈ సమయంలోనే చెక్-ఇన్ మూసివేయబడింది. నేను నా ఫ్లైట్‌ను మిస్ అయ్యాను" అని అభిషేక్ శర్మ చెప్పాడు.
ఒక్క రోజు సెలవు కోల్పోయాను : అభిషేక్ శర్మ
ఇండిగో తీరు కారణంగా తాను తనకు అభించిన ఒక రోజు సెలవును కోల్పోయానని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు. "నాకు ఒక రోజు మాత్రమే సెలవు ఉంది, అది ఇప్పుడు పూర్తిగా కోల్పోయాను. దీన్ని మరింత దిగజార్చడానికి, వారు ఎటువంటి సహాయ సహకారాలను అందించడం లేదు. ఇది చాలా చెత్త ఎయిర్‌లైన్ అనుభవం.. ఇది చెత్త సిబ్బంది పనితీరు” అని అభిషేక్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ సిరీస్ టీ20 జట్టులో అభిషేక్ శర్మ
ఈ నెలలో ఇంగ్లాండ్ భారత పర్యటనకు రానుంది. ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కోసం భారత జట్టు 16 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. ఈ టీమ్ లో భారత యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా చోటు దక్కించుకున్నాడు.
ఇటీవల అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టులో భాగంగా ఉన్నాడు. క్వార్టర్ ఫైనల్‌లో మహారాష్ట్ర చేతిలో పంజాబ్ ఓడిపోయి టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 8 మ్యాచ్‌ల్లో 58.37 సగటుతో ఒక సెంచరీ, మూడు సెంచరీలతో సహా 467 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 22 ఏళ్ల ప్లేయర్ 7 మ్యాచ్‌ల్లో 42 సగటుతో 28 బంతుల్లో రికార్డు సెంచరీతో సహా 255 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఫామ్ కారణంగా, అభిషేక్ శర్మ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత T20I జట్టులో చోటుదక్కించుకున్నాడు.
Abhishek Sharma, Team India, Cricket
రెండో మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ
అభిషేక్ శర్మ ఇప్పటికే భారతదేశం తరపున 23 T20Iలు ఆడాడు. తన రెండో మ్యాచ్ లోనే అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. 23.27 సగటు, 171.81 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 256 పరుగులు చేశాడు. జూలై 2024లో హరారేలో జింబాబ్వేపై తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత, అతను ఏడు ఇన్నింగ్స్‌లలో 20 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంలో విఫలమయ్యాయి.
గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో, అభిషేక్ శర్మ సెంచూరియన్‌లో ఫిఫ్టీ, జోహన్నెస్‌బర్గ్‌లో కీలకమైన 36 పరుగులు చేశాడు. అయితే, దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడటంతో అతనికి భారత జట్టులో మరోసారి చోటు కల్పించారు.