క్రికెట్ ప్రపంచంలో విరాట్ శకానికి 14 ఏళ్లు... ఆ రాజసాన్ని మళ్లీ చూస్తామా...

First Published Aug 18, 2022, 1:08 PM IST

విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో ఇది కేవలం ఓ పేరు మాత్రమే కాదు, బ్రాండ్! అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేస్తూ, సెంచరీలు ఇంత సులువుగా చేయొచ్చా? అని క్రికెట్ లెజెండ్స్‌ను కూడా ఆశ్చర్యపోయేలా చేసిన ఓ రన్‌  మెషిన్... సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయగల ఒకే ఒక్కడిగా ప్రశంసలు దక్కించుకున్న మాజీ కెప్టెన్. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ ఆరంగ్రేటానికి నేటికి సరిగ్గా 14 ఏళ్లు...

2008లో అండర్‌-19 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీకి టీమిండియా నుంచి పిలుపు దక్కింది. అదే ఏడాది ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు విరాట్ కోహ్లీ...

కేవలం 8 లిస్టు ఏ మ్యాచులు మాత్రమే ఆడిన అనుభవం ఉన్న విరాట్ కోహ్లీని భారత జట్టుకి ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.  అయితే భారత సీనియర్ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ గాయపడడంతో ఓపెనర్‌గా కోహ్లీకి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.

19 ఏళ్ల వయసులో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ, తన తొలి మ్యాచ్‌లో 12 పరుగులకే అవుట్ అయ్యాడు. అదే సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న కోహ్లీ, మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకి సిరీస్ విజయాన్ని అందించాడు.
 

అయితే ఆ తర్వాత కొన్ని రోజులు మళ్లీ విరాట్‌ని పట్టించుకోలేదు సెలక్టర్లు. 2009లో శిఖర్ ధావన్ గాయపడడంతో ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఏ తరుపున ఆడాడు విరాట్ కోహ్లీ. అందులో 49 పరుగులు చేసి ఆకట్టుకున్న విరాట్‌.. ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరుపున 105 పరుగులు చేసి అదరగొట్టాడు. బ్రెట్‌లీ, స్టువర్ట్ క్లార్క్, మిచెల్ జాన్సన్ వంటి ఆసీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేసిన విరాట్‌కి టీమిండియా నుంచి మరోసారి పిలుపు వచ్చింది...
 

శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గౌతమ్ గంభీర్ గాయపడడం, 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో యువరాజ్ సింగ్ గాయపడడంతో వారి స్థానాల్లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న విరాట్ కోహ్లీ... సత్తా చాటి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో విండీస్‌పై79 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు కోహ్లీ...

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో గౌతమ్ గంభీర్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 111 బంతుల్లో 107 పరుగులు చేసి తొలి వన్డే సెంచరీ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన గంభీర్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కితే, దాన్ని విరాట్ కోహ్లీతో పంచుకున్నాడు గౌతీ...

అక్కడి నుంచి విరాట్ కోహ్లీకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు... విండీస్ టూర్‌లో ధోనీ గాయపడడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ, సారథిగా తన రెండో వన్డేలోనే సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వే టూర్‌లో ఐదు వన్డేలను క్లీన్‌స్వీప్ చేసి, భారత్‌కి మొట్టమొదటి విదేశీ క్లీన్‌స్వీప్ వన్డే విజయాన్ని అందించాడు.

టెస్టుల్లో స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్... వన్డే, టీ20ల్లో డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్, ఆరోన్ ఫించ్, బాబర్ ఆజమ్ వంటి ప్లేయర్లు పరుగుల వరద పారిస్తుంటే... విరాట్ కోహ్లీ ఒక్కడే ఏ ఫార్మాట్‌‌తో సంబంధం లేకుండా రికార్డుల మోత మోగించాడు...

టెస్టుల్లో 27 సెంచరీలు, వన్డేల్లో 43 సెంచరీలతో 70 అంతర్జాతీయ శతకాలు అందుకున్న విరాట్ కోహ్లీ, ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్, ఫాలోయింగ్ అందుకున్నాడు. 14 ఏళ్లు ముగిసే సమయానికి సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ వన్డే రికార్డులు మెరుగ్గా ఉండడం విశేషం...

14 ఏళ్ల క్రికెట్ కెరీర్ ముగిసే సమయానికి సచిన్ టెండూల్కర్ 312 మ్యాచుల్లో 45.14 సగటుతో 12,685 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా 253 ఇన్నింగ్స్‌ల్లో 12,344 పరుగులు చేశాడు. విరాట్ వన్డే సగటు 57.83 కాగా, ఇప్పటికే 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు చేశాడు...

14 ఏళ్లు ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 23726 అంతర్జాతీయ పరుగులు, 70 సెంచరీలు, 57 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో ప్రస్తుత తరంలో మిగిలిన క్రికెటర్లకు అందనంత ఎత్తులో ఉన్నాడు. 2008 నుంచి అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక డబుల్ సెంచరీలు, అత్యధిక మ్యాన్ ఆఫ్ సిరీస్‌లు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు గెలిచిందీ విరాట్ కోహ్లీయే... 

అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా టాప్ 4లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. విదేశాల్లో విజయాలు అందుకోలేకపోయిన మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఎప్పుడో దాటేశాడు. ధోనీ కెప్టెన్సీలో వరుస పరాజయాలతో ఏడో స్థానానికి పడిపోయిన టీమిండియాను... వరుసగా ఐదేళ్లు టాప్‌లో నిలిపాడు... అయితే కొన్నాళ్లు విరాట్ టైమ్, ఫామ్ అస్సలు బాలేవు. విరాట్ క్రీజులో ‘కింగ్’లా చెలరేగిపోతుంటే మరోసారి ఆ రాజసాన్ని చూడగలమా... అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.. 

click me!