2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి పదేళ్లు... శిఖర్ ధావన్‌ని పక్కనబెట్టడమే టీమిండియా చేసిన పెద్ద తప్పిదమా..

First Published Jun 23, 2023, 12:56 PM IST

2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో ఐసీసీ వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా మూడు వైట్ బాల్ ఐసీసీ టైటిల్స్ గెలిచిన మొట్టమొదటి జట్టుగా టీమిండియా చరిత్ర క్రియేట్ చేసింది. అయితే ఈ విజయం తర్వాత 10 ఏళ్లలో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది భారత జట్టు...

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుని ఫైనల్‌కి దూసుకొచ్చింది టీమిండియా... ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది..

బ్యాటింగ్‌కి అత్యంత కఠినంగా మారిన పిచ్‌పై విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా శిఖర్ ధావన్ 31, రవీంద్ర జడేజా 33 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 9, సురేష్ రైనా 1, దినేశ్ కార్తీక్ 6 పరుగులు చేయగా మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ అయ్యాడు...

Latest Videos


130 పరుగుల ఈజీ టార్గెట్‌ని ఇంగ్లాండ్ ఇట్టే కొట్టేస్తుందని అనుకున్నారంతా... అయితే అలెస్టర్ కుక్‌ని ఉమేశ్ యాదవ్, ఇయాన్ బెల్‌ని జడేజా, జొనార్థన్ ట్రాట్‌, జో రూట్‌లని అశ్విన్ అవుట్ చేయడంతో 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లాండ్..

ఈ దశలో ఇయాన్ మోర్గాన్, రవి బోపారా కలిసి ఐదో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దీంతో 17.2 ఓవర్లు ముగిసే సరికి 110/4 చేరుకున్న ఇంగ్లాండ్, ఆఖరి 16 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది..

అప్పటికే మొదటి 3 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన ఇషాంత్ శర్మ, 18వ ఓవర్ మొదటి 2 బంతుల్లో 2 ఫోర్లు ఇచ్చేశాడు. అయితే మూడో బంతికి ఇయాన్ మోర్గాన్‌ని అవుట్ చేసిన ఇషాంత్, ఆ తర్వాతి బంతికి రవి బోపారాని పెవిలియన్ చేర్చాడు..

క్రీజులో సెటిల్ అయిన ఇద్దరు బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ కావడంతో జోస్ బట్లర్ (0), టిమ్ బ్రెస్మన్ (2) వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సిన స్థితి దాకా వచ్చింది... అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతిని ట్రెడ్‌వెల్ మిస్ చేయడంతో టీమిండియాకి 5 పరుగుల తేడాతో విజయం దక్కింది...

ఈ సిరీస్‌లో 5 మ్యాచుల్లో 90.75 సగటుతో 363 పరుగులు చేసిన శిఖర్ ధావన్, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ‘గోల్డెన్ బ్యాట్’ అందుకున్నాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి...

Champions Trophy

5 మ్యాచుల్లో 12 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ‘గోల్డెన్ బాల్’ అందుకున్నాడు. ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా రాణించే శిఖర్ ధావన్‌కి టీ20 వరల్డ్ కప్ 2021, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో చోటు దక్కలేదు.

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో శిఖర్ ధావన్‌కి చోటు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడినా, శుబ్‌మన్ గిల్ కారణంగా అతన్ని మూడు ఫార్మాట్లలోనూ పక్కనబెట్టేశారు సెలక్టర్లు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో గిల్ ఫెయిల్ అయితే శిఖర్ ధావన్‌ని పక్కనబెట్టినందుకు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు...

click me!