Expensive Number Plate
Expensive Number Plate : ఈరోజుల్లో మనిషులను చూసికాదు వాళ్లు వాడే వాహనాలను బట్టి మర్యాద దక్కుతోంది. దీన్నిబట్టే వారి అంతస్తు నిర్ణయించబడుతోంది. నడిచివస్తే పేదవారని, ప్రజారవాణా వాహనాలు బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తే మధ్యతరగతివారని, చిన్నకారుంటే ఎగువ మధ్యతరగతి, పెద్దపెద్ద లగ్జరీ కార్లుంటే ధనవంతులుగా నిర్దారించుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త కల్చర్ మొదలయ్యింది... ఖరీదైన కారు కాదు దానికి తగ్గట్లు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కలిగివుండటం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. అందువల్లే ప్రముఖ రాజకీయ నాయకుల నుండి సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు చాలామంది తమ కార్లకు ఫ్యాన్సీ నంబర్ ఉండేలా చూసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫ్యాన్సీ నంబర్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఖర్చయినా సరే... తమ వాహనానికి ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండాలని చాలామంది బడాబాబులు కోరుకుంటున్నారు. చివరకు కారు కంటే రిజిస్ట్రేషన్ కే ఎక్కువ ఖర్చు చేసేస్థాయికి చేరుకున్నారు... ఏదేమైన ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ పొందడమే వారికి కావాల్సింది. ప్రజలు కూడా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కనిపించగానే ఎప్పుడూ చూడని వస్తువేదో చూసినట్లు నోరెళ్ళబెడతారు. అందువల్లే తమ స్టేటస్ ను ప్రదర్శించేందుకు ఫ్యాన్సీ నంబర్ల కోసం లక్షలు ఖర్చుచేయడానికి వెనకాడటం లేదు.
తాజాగా కేరళలో ఓ ఫ్యాన్సీ నంబర్ భారీ ధర పలికింది. ఫార్చ్యూనర్, బిఎండబ్ల్యూ , మెర్సిడెస్ బెంజ్ కార్లకంటే ఎక్కువ ధర ఆ నెంబర్ ప్లేట్ దే. ఇంతకూ అంత ఫ్యాన్సీ నెంబర్ ఏమిటి? ఎంతధరకు అమ్ముడుపోయింది? ఎవరు దక్కించుకున్నారు? తదితర విషయాలను తెలుసుకుందాం.
Expensive Number Plate
KL 07 DG 0007 నంబర్ ఎంత ధర పలికిందో తెలుసా?
ఇటీవల కేరళ రవాణా శాఖ ఫ్యాన్సీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను వేలం వేసింది. ఇందులో చాలా నంబర్లు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. అయితే వాటిలో ఒక నంబర్ రూ. 45 లక్షలు పలికింది. ఎర్నాకుళం ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో ప్రతిష్టాత్మకమైన నంబర్ల కోసం తీవ్ర బిడ్డింగ్ జరిగింది.
KL 07 DG 0007 నంబర్‌కు అత్యధిక ధరకు దక్కించుకుంది ఒక ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపనీ. ఆ నంబర్‌కు రూ.45 లక్షలు చెల్లించింది. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్. ఈ నెంబర్ ప్లేట్ ను రూ.4 కోట్లు విలువైన వాహనంకోసం దక్కించుకున్నట్లు సమాచారం.
ఇక KL 07 DG 0001 ను దక్కించుకునేందుకు కూడా చాలామంది ప్రయత్నించారు. కానీ పిరవోమ్ నివాసి అయిన థామ్సన్ రూ.25 లక్షలకు దీన్ని దక్కించుకున్నారు. తన ఖరీదైన కారుకోసం దీన్ని కొనుగోలు చేసాడు.
ఈ వేలంలో ఐదుగురు బిడ్డర్లు KL 07 DG 0007 కోసం పోటీ పడ్డారు, నలుగురు బిడ్డర్లు KL 07 DG 0001 కోసం పోటీ పడ్డారు. వేలంలో పాల్గొనడానికి బిడ్డర్లు రూ. 1 లక్ష వరకు ముందస్తు బుకింగ్ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఈ అమ్మకం భారతదేశంలో ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ ను తెలియజేస్తుంది.
Expensive Number Plate
తెలంగాణలోనూ అత్యధిక ధర పలికిన నంబర్ ప్లేట్ :
తెలంగాణలో బిఆర్ఎస్ పాలన కొనసాగినంతకాలం వాహనాల రిజిస్ట్రేషన్ కోసం TS ఉపయోగించారు... కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ TS స్థానంలో TG ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏదయినా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే TG తో నంబర్ ప్లేట్ వస్తుంది. ఇలా TG తో ప్రారంభమయ్యే ఫ్యాన్సీ నంబర్ల కోసం తెలుగు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టివో కార్యాలయంలో ఇటీవల ఫ్యాన్సీ నంబర్ల వేలంపాట జరిగింది. ఇందులో పాల్గొన్న సోనీ ట్రాన్స్పోర్ట్స్ సొల్యూషన్ సంస్థ ఏకంగా 25 లక్షల 50 వేల రూపాయలకు TG 09 9999 నంబర్ ను దక్కించుకుంది. ఈ సంస్థ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం కోసం ఈ ఫ్యాన్సీ నంబర్ ను దక్కించుకుంది.
ఇక ఈ TG సీరీస్ లో మొట్టమొదటి నంబర్ కు కూడా భారీ ధర వచ్చింది. TG 09 0001 నంబర్ ప్లేట్ కు వేలంపాటలో రూ.9 లక్షలకు పైగా దక్కింది. ఇలా టిఎస్ నుండి టిజికి మారాక ఫ్యాన్సీ నంబర్లకు గిరాకీ పెరిగిందని ఆర్టిఓ అధికారులు చెబుతున్నారు.