Car: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కారు కొనాలనుకునే చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) లేదా సీఎన్‌జీ (CNG) కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దీర్ఘకాలంలో ఏది ఎక్కువ లాభం ఇస్తుంది? నిర్వహణ ఖర్చు ఏదిలో తక్కువ?
కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో సీఎన్‌జీ కారుతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు ధర సాధారణంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఎక్కువగా ఉంటుంది. కానీ దీర్ఘకాల వినియోగంలో పరిస్థితి మారుతుంది. ఒక వ్యక్తి ఏడాదికి సుమారు 15,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే, 15 ఏళ్లలో మొత్తం 2,25,000 కిలోమీటర్లు ప్రయాణించినట్లవుతుంది.
ఇంట్లోనే ఈవీని ఛార్జ్ చేస్తే సగటున కిలోమీటరుకు రూ.1.5 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన 15 ఏళ్లలో మొత్తం విద్యుత్ ఖర్చు సుమారు రూ.3.37 లక్షలు మాత్రమే అవుతుంది. అదే సీఎన్‌జీ కారుకు కిలోమీటరుకు సుమారు రూ.4 ఖర్చు వస్తే, 15 ఏళ్లలో దాదాపు రూ.9 లక్షలు ఇంధనానికే వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఇంధన వ్యయంలో మాత్రమే ఈవీ ద్వారా సుమారు రూ.5.5 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది.
25
నిర్వహణ ఖర్చులో కూడా ఎలక్ట్రిక్ కారే ముందంజ
ఇంధన ఖర్చుతో పాటు వాహన నిర్వహణ కూడా ముఖ్యమైన అంశమే. సీఎన్‌జీ కారులో ఇంజిన్, గేర్‌బాక్స్, క్లచ్ వంటి అనేక యాంత్రిక భాగాలు ఉంటాయి. అందువల్ల ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఫిల్టర్లు మార్చడం, సీఎన్‌జీ కిట్ తనిఖీలు చేయించడం వంటి పనులకు తరచూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ కారులో మాత్రం సంప్రదాయ ఇంజిన్ ఉండదు. ప్రధానంగా బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే ఉంటాయి. దీంతో ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం ఉండదు. నిర్వహణ ఖర్చు కూడా సీఎన్‌జీ కారుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
35
బ్యాటరీ ఖర్చు.. ఈవీకి ఉన్న ప్రధాన సవాలు
అన్ని అంశాల్లో ఈవీకి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, బ్యాటరీ ఖర్చు మాత్రం ప్రధానమైన అంశంగా పరిగణించాలి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలకు 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. ఒకవేళ వాహనాన్ని 15 సంవత్సరాలు ఉపయోగించాలని భావిస్తే, జీవితకాలంలో కనీసం ఒకసారి బ్యాటరీ మార్చాల్సిన అవసరం రావచ్చు. ప్రస్తుతం బ్యాటరీ మార్పిడి ఖర్చు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాల ప్రణాళికలో ఈ ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
వాహనాన్ని కొన్నేళ్ల తర్వాత విక్రయించాలనుకునే వారికి రీ-సేల్ విలువ కూడా కీలకం. ప్రస్తుతం పాత సీఎన్‌జీ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంచి ధరకు విక్రయించే అవకాశం ఉంటుంది. అయితే పాత ఎలక్ట్రిక్ కారు విలువ ఎక్కువగా బ్యాటరీ పరిస్థితిపైనే ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ పనితీరు బాగుంటే మంచి ధర రావచ్చు. లేకపోతే రీ-సేల్ విలువ తగ్గే అవకాశం ఉంటుంది.
55
దీర్ఘకాలంలో ఏది మంచి ఎంపిక?
రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారు, ఇంధనంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఎలక్ట్రిక్ కారు మంచి ఎంపికగా మారవచ్చు. అయితే ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉండటంతో పాటు భవిష్యత్తులో బ్యాటరీ మార్పిడి ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరోవైపు తక్కువ పెట్టుబడితో కారు కొనాలనుకునే వారు, రీ-సేల్ విలువకు ప్రాధాన్యం ఇచ్చేవారు సీఎన్‌జీ కారును ఎంచుకోవచ్చు. కాబట్టి మీ ప్రయాణ అవసరాలు, బడ్జెట్, వినియోగ కాలాన్ని పరిశీలించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.