Agriculture: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వంటి దిగ్గజ టెక్ కుబేరులు లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను వరుసగా కొనుగోలు చేస్తున్నారు. ఈ టెక్ దిగ్గజాలు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు?
వ్యవసాయ భూముల్లోకి బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్
అమెరికాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. మొన్నటి వరకు కోడింగ్, యాప్‌లు, ఏఐ అంటూ నెట్ వరల్డ్‌ను ఏలిన టెక్ దిగ్గజాలు.. ఇప్పుడు సడన్‌గా వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీల యజమానులు ఇప్పుడు వేల, లక్షల ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. కొందరు కేవలం పెట్టుబడి కోసం భూములు కొంటుంటే, మరికొందరు స్వయంగా పశువుల పెంపకం, కూరగాయల సాగు చేపడుతున్నారు. అసలు ఈ టెక్ దిగ్గజాలు హఠాత్తుగా భూముల పై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో వివరంగా తెలుసుకుందాం.
26
కోట్ల విలువైన ఫామ్‌లో జుకర్ బర్గ్ పశువుల పెంపకం
మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఆయన హవాయిలోని కౌవాయ్ ఐలాండ్‌లో ఉన్న ‘కౌలావు రాంచ్’లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 4,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రైవేట్ ఫామ్ విలువ సుమారు రూ. 2,871 కోట్లుగా ఉంది. జుకర్ బర్గ్ ఇక్కడ అత్యంత ఖరీదైన 'వాగ్యూ, ఆంగస్' జాతికి చెందిన పశువులను పెంచుతున్నారు. తన ప్రైవేట్ ఫార్మ్‌హౌస్‌తో పాటు పశువుల పెంపకం, వ్యవసాయ కార్యకలాపాల కోసం ఆయన ఈ భూమిని ఉపయోగిస్తున్నారు.
36
లక్షల ఎకరాల భూములకు అధిపతులుగా గేట్స్, బెజోస్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికాలోనే అతిపెద్ద వ్యవసాయ భూమి యజమానుల్లో ఒకరిగా నిలిచారు. రిపోర్టుల ప్రకారం, ఆయన దగ్గర ఏకంగా 2.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూములను ఆయన లీజుకు ఇవ్వడంతో పాటు నేరుగా సాగు చేస్తున్నారు. మరోవైపు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వద్ద సుమారు 4.62 లక్షల ఎకరాల భూమి ఉంది. వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన స్టెన్ క్రోన్కే వద్ద ఏకంగా 27 లక్షల ఎకరాల భూమి ఉంది. క్రోన్కే 2025లో న్యూమెక్సికోలో 9.38 లక్షల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ రాంచ్ విక్రయంగా నమోదైంది.
ఈ భారీ భూముల్లో కేవలం పశువుల పెంపకమే కాకుండా రకరకాల పంటలను కూడా పండిస్తున్నారు. అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఫామ్‌లలో బంగాళాదుంపలు, క్యారెట్లు, ఉల్లిపాయలు, సోయాబీన్, మొక్కజొన్న, ప్రత్తి వంటి పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. టెక్ బిలియనీర్లు ఈ భూముల్లో కొంత భాగాన్ని స్థానిక రైతులకు కౌలుకు కూడా ఇస్తున్నారు. దీనివల్ల రైతులకు ఉపాధి దక్కడంతో పాటు భూ యజమానులకు క్రమం తప్పకుండా నెలకు మంచి ఆదాయం సమకూరుతోంది.
56
పెరుగుతున్న భూముల ధరలు
అమెరికాలో అగ్రికల్చర్ ల్యాండ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గణాంకాల ప్రకారం, గత ఏడాది వ్యవసాయ భూముల ధరల్లో 4.3 శాతం పెరుగుదల నమోదైంది. భూమి పరిమితంగా ఉండటం, డిమాండ్ రోజురోజుకీ పెరగడంతో ఈ రంగాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా బిలియనీర్లు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడటమే కాకుండా, రాబోయే రోజుల్లో వీటి విలువ మరింత పెరుగుతుందని భావించి పెద్ద ఎత్తున నిధులను వీటిలోకి మళ్లిస్తున్నారు.
66
ఏఐ డేటా సెంటర్లు, మారుతున్న లైఫ్‌స్టైల్
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు టెక్ కంపెనీలకు విపరీతమైన భూమి అవసరమవుతోంది. ఇది కూడా భూముల కొనుగోలుకు ఒక కారణం. మరోవైపు, కరోనా మహమ్మారి తర్వాత బిలియనీర్ల జీవనశైలిలో చాలా మార్పులొచ్చాయి. పట్టణాలకు దూరంగా ప్రైవేట్ ఫామ్‌లలో నివసించడం, వేటాడటం, చేపలు పట్టడం, తమకు కావాల్సిన ఆర్గానిక్ ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం ట్రెండ్‌గా మారింది. అయితే, బిలియనీర్లు ఇలా ఎగబడి భూములు కొంటుండటంతో ల్యాండ్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చిన్న తరహా, యువ రైతులకు భూమి కొనడం పెద్ద సవాలుగా మారింది.