రైల్వే స్టేషన్ పేర్ల చివర జంక్షన్, సెంట్రల్ అని ఎందుకుంటుందో తెలుసా?

First Published Oct 23, 2024, 1:16 PM IST

మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక్కో రైల్వే స్టేషన్ కు ఒక్కో ప్రత్యేకమైన పేరు ఉందని.. విజయవాడ జంక్షన్, సికింద్రాబాద్ కాంటొన్మెంట్, చెన్నై సెంట్రల్, యశ్వంత్‌పూర్ టెర్మినల్ ఈ పేర్లు చూసినప్పుడు ఊరి పేరు చివర జంక్షన్, సెంట్రల్ లాంటి పదాలు ఎందుకున్నాయో అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న కారణాలను ఇక్కడ డీటైల్డ్ గా తెలుసుకుందాం. 
 

భారత దేశంలో నడుస్తున్న రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థల్లో మూడోది. ప్రైవేటు సంస్థల్లా వేర్వేరుగా పనిచేసే 42 రైల్వే సంస్థలన్నీ కలిసి 1951లో కలిసి భారతీయ రైల్వే ఏర్పడింది. ప్రస్తుతం ప్రతి రోజూ 8,702 ట్రైన్స్ ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రతి రోజు కోట్ల మంది రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే డిపార్ట్ మెంట్ వివిధ రకాల విభాగాలను ఏర్పాటు చేసింది.  వాటిల్లో రైల్వే కోచ్ లు తయారు చేసేవి కొన్ని, ట్రాక్స్ తయారు చేసేవి, విద్యుత్తు లైన్లు వేసేవి, స్టేషన్ల నిర్మాణం ఇలాంటివి వివిధ రకాల డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. 
 

అంతేకాకుండా రైళ్లు నడిపే డిపోలకు ప్రత్యేక మైన పేర్లు పెట్టి అవి నడిపే రైళ్ల ప్రత్యేకతలు తెలియజేస్తాయి. అలాంటివే జంక్షన్, సెంట్రల్, టర్మినల్, రోడ్ లాంటివి. రైల్వే స్టేషన్లకు జంక్షన్, సెంట్రల్, టెర్మినల్, కంటోన్మెంట్ వంటి వేరువేరు పేర్లు ఉండటానికి ముఖ్యమైన కారణాలున్నాయి. వాటి స్థానిక ప్రాముఖ్యత, రైలు మార్గాల ఆధారంగా వాటికి ఆ పేర్లు కలుపుతారు. 

జంక్షన్(Junction)
జంక్షన్ అనేది రైల్వే స్టేషన్ నుంచి రెండు లేదా అంతకంటే ఎక్కువ రైలు మార్గాలు విడిపోవడం లేదా కలవడం జరిగే ప్రదేశమని అర్థం. ఉదాహరణకు విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్ ఇలాంటివి. జంక్షన్ స్టేషన్లు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి వివిధ రైల్వే మార్గాలకు సెంట్రల్ పాయింట్‌గా ఉంటాయి. రైళ్లు అక్కడి నుంచి వేర్వేరు దిశల్లో ప్రయాణిస్తాయి.
 

Latest Videos


సెంట్రల్(Central)
సెంట్రల్ అంటే ఆ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ లేదా పెద్ద నగరాలకు కనెక్ట్ చేసే ప్రధాన నెట్‌వర్క్ స్టేషన్ అని అర్థం. సెంట్రల్ స్టేషన్లు ఒక నగరానికి లేదా ప్రాంతానికి ముఖ్యమైన హబ్‌గా పనిచేస్తాయి. అంటే సెంట్రల్ స్టేషన్లు నగరానికి మధ్యలో ఉంటాయి. అక్కడి నుంచే ఎక్కువగా ప్రధాన రైలు సర్వీసులు నిర్వహిస్తారు. చెన్నై సెంట్రల్, ముంబై సెంట్రల్ లాంటివి ఈ కేటగిరీకి చెందుతాయి. 

టెర్మినల్(Terminal)
ట్రైన్స్ అక్కడ స్టార్ అవడం లేదా ఎండ్ అవడం జరిగే స్టేషన్ ను టెర్మినల్ స్టేషన్ అంటారు. ఒకసారి ఇక్కడకు వచ్చిన రైళ్లు తిరిగి అక్కడ నుంచి బయలుదేరుతాయి. వీటికి ఉదాహరణగా ముంబైలో CST టెర్మినల్, యశ్వంత్‌పూర్ టెర్మినల్స్ ను చెప్పొచ్చు. టెర్మినల్ స్టేషన్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి ఒక ట్రెయినింగ్ సెంటర్‌గా ఉంటాయి. అక్కడ రైలు మార్గం ముగుస్తుంది. కాబట్టి దానిని చివరి స్టేషన్‌గా పరిగణిస్తారు.
 

Railway Station

కాంటొన్మెంట్(Cantonment)

ఆర్మీ, మిలటరీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉండే స్టేషన్లను కాంటొన్మెంట్ స్టేషన్లు అంటారు. ఉదాహరణకు బెంగళూరు కాంటొన్మెంట్, సికింద్రాబాద్ కాంటొన్మెంట్ స్టేషన్లకు చాలా దగ్గరగా ఆర్మీ, మిలటరీ ట్రైనింగ్ సెంటర్లు, ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఈ స్టేషన్ల ప్రత్యేకత ఏమిటంటే ఈ స్టేషన్లు మిలటరీ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి.  ఈ పేర్లు రైల్వే స్టేషన్ల కేటగిరీలను, ఆ స్టేషన్ వహించే పాత్రను, అలాగే ట్రాఫిక్ నెట్‌వర్క్‌లో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
 

రోడ్(Road)
ఊరికి దగ్గరగా రైల్వే ట్రాక్ వెళ్లనప్పుడు దూరంగా స్టేషన్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ స్టేషన్ ఆ ఊరికి చెందినదని తెలియజేయడానికి ఆ స్టేషన్ పేరు చివర రోడ్ అని తగిలిస్తారు. దీన్ని బట్టి ఆ స్టేషన్ ఆ ఊరిదిగా అర్థమవుతుంది. దీనికి ఉదాహరణగా నర్సీపట్నం రోడ్, మదనపల్లి రోడ్ స్టేషన్లను చెప్పొచ్చు.

click me!